ఆర్మీ ఆఫీసర్‌ అన్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

20 Jun, 2021 15:05 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో మహిళలను ఆకర్షించడానికి తనను ఆర్మీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రేటర్‌ కైలాష్‌ 1 పాంతానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో మహిళలను ఆకర్షించడానికి ఆర్మీ ఆఫీసర్‌ కెప్టెన్ శేఖర్‌గా నాటకం ఆడుతున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆర్మీ యూనిఫాం ధరించిన నిందితుడిని పట్టుకున్నారు.

నింధితుడిని నగర పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మోహన్ గార్డెన్ నివాసి దిలీప్ కుమార్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడు వివిధ అంతర్జాతీయ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతనికి ఏవైనా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయా.. అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఇక​ మరో ఘటనలో, 100 మందికి పైగా మహిళలకు అశ్లీల సందేశాలు, వీడియోలు పంపినందుకు ఓ జిమ్ ట్రైనర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తన ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అశ్లీల సందేశాలు, వీడియోలు పంపుతున్నాడని పేర్కొంటూ ఓ మహిళ ఇటీవల సాగర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, ఫేస్‌బుక్‌ నుంచి సమాచారం సేకరించి, నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్‌లో వివిధ నకిలీ ఖాతాలను సృష్టించి అతడు మహిళలకు ఈ సందేశాలను పంపినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: ఈ భూమిపై మాకింత చోటేది?

మరిన్ని వార్తలు