డీసీఎంను రీ డిజైన్‌ చేసి గంజాయి సరఫరా

5 Mar, 2023 05:41 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున సీపీ డీఎస్‌ చౌహాన్‌

నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు

రూ.కోటిన్నర విలువైన 400 కేజీల మాదకద్రవ్యం స్వాధీనం

నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని  చౌటుప్పల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే  400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్‌బీనగర్‌లోని రాచకొండ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్‌ వీరన్న,  శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన కేతావత్‌ శంకర్‌నాయక్, వరంగల్‌ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్‌ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో  ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్‌ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్‌ చేసుకుంటూ వస్తున్నారు.

ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్‌ పోలీసులు శనివారం ఉదయం డికాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్‌ చౌరస్తాలో  గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్‌ చంద్ర,  చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐలు మల్లికార్జున్‌రెడ్డి, మహేష్, మోతీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు