బెంగళూరులో బంగ్లాదేశ్‌ యువతిపై గ్యాంగ్‌ రేప్‌.. వీడియో వైరల్‌ 

29 May, 2021 02:21 IST|Sakshi

బంగ్లాదేశ్‌లో వీడియో వైరల్‌ 

సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు  

నలుగురు నిందితుల అరెస్ట్‌

కృష్ణరాజపురం: బంగ్లాదేశ్‌కు చెందిన యువతిని చిత్రహింసలకు గురి చేసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ దారుణ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో బెంగళూరులోని రామమూర్తి నగర పోలీసులు స్పందించి సుమోటోగా కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు యువకులు, వారికి సహకరించిన ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరు మహిళలతో కలిసి అక్రమంగా దేశం దాటి వచ్చి బెంగళూరులో మకాం వేశారు. కొద్ది రోజుల క్రితం మందు పార్టీ చేసుకున్నారు.

ఈక్రమంలో తమకు పరిచయం ఉన్న తమ దేశానికే చెందిన యువతిపై యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో బంగ్లాదేశ్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వైరల్‌ అయింది. ఈ ఘటన జరిగింది బెంగళూరులో అని అస్సాం పోలీసు కమిషనర్‌ గుర్తించి బెంగళూరు పోలీసు కమిషనర్‌ కమల్‌ పంత్‌కు సమాచారం అందించారు. రామ్మూర్తి నగర ఎన్‌ఆర్‌ఐ లేఔట్‌లోని ఒక ఇంట్లో ఈ దారుణం జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేసి, రిదాయ్‌బాబు, రకీబుల్లా ఇస్లామ్‌ సాగర్, మహమ్మద్‌ బాబా షేక్, హకిల్‌ అనే నిందితులతోపాటు ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేశారు.  

నిందితులపై పోలీసు కాల్పులు 
శుక్రవారం ఉదయం 6.30 గంటలకు నిందితుల్లో ఇద్దరైన రిదాయ్‌ బాబు, రకీబుల్లాలను సంఘటన స్థలానికి రామూర్తి నగర పోలీసులు తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో బి.చెన్నసంద్ర సమీపంలోని కనకనగర వద్ద నిందితులు తప్పించుకుని పరారయ్యేందుకు ప్రయత్నించారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఏసీపీ మెల్విన్‌ ఫ్రాన్సిస్, కానిస్టేబుల్‌ రవిపై నిందితులు రాళ్ల దాడి చేసి గాయపరిచారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన నిందితులిద్దరిని ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలి ఆచూకీ లభ్యం 
ఘటన జరిగిన తర్వాత బాధితురాలు బెంగళూరును వీడి వెళ్లింది. డీసీపీ డాక్టర్‌ శరణప్ప ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి గాలించగా ఆమె కేరళలో ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసు బృందం వెళ్లి బాధితురాలిని బెంగళూరుకు తీసుకొచ్చారు.
చదవండి: వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు