ఖతర్నాక్‌ కి‘లేడీ’..  ఖమ్మంలో ఘరానా మోసం

13 Jun, 2022 13:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఖమ్మం: వదినగారు, అన్నయ్యగారు.. మేము అర్జెంట్‌గా చుట్టాల ఇంటికి వెళ్తున్నాం.. అసలే దొంగల భయం ఉంది.. ఈ సూట్‌కేస్‌ను మీ ఇంట్లో పెట్టండి అంటూ ఆ మహిళ మొదట మాటలు కలుపుతుంది. ఆ తర్వాత ఈ సూట్‌కేస్‌ను మీ మీద నమ్మకంతో అప్పగిస్తున్నా.. ఎందుకంటే దీనిలో రూ.10లక్షల బంగారం, రూ.3కోట్లు విలువ చేసే ఇంటి పత్రాలు, 60 ఎకరాల భూమి తాలుకా కాగితాలు ఉన్నాయంటూ అవతలవారు నోరు వెళ్లబెట్టేలా నమ్మబలికిస్తుంది. మరో మూడు రోజుల తర్వాత వచ్చి తన సూట్‌కేస్‌ తీసుకుని థ్యాంక్స్‌ చెబుతూ.. ఎంతో శ్రీమంతురాలిలా కనిపిస్తుంది. మరో రెండు రోజుల తర్వాత సూట్‌కేస్‌ పెట్టిన వారికి ఫోన్‌ చేసి వదిన గారు అర్జెంట్‌గా రూ. 5లక్షలు కావాలి.. మాకు వచ్చే డబ్బులు ఇంకా రాలేదు.. వడ్డీ ఎంతయినా పర్వాలేదు అంటుంది. అప్పటికే ఆమె హుందాతనాన్ని చూసిన వాళ్లు వెనుకాడకుండా అడిగిన డబ్బులు అప్పుగా ఇస్తున్నారు.

అంతేఇక తర్వాత ఇచ్చిన అప్పుకోసం ఫోన్‌ చేస్తే రేపు, మాపు అంటూ వాయిదాలు వేస్తూ.. ఎక్కడకు పారిపోతాం మా ఇల్లు ఇక్కడే కదా.. అంటూ దబాయించడం మొదలుపెడతారు. ఇదే తరహాలో జరిగిన ఒక సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. నగరంలోని టూటౌన్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ తాను రూ.5, 10 లక్షల చిట్టీలు వేస్తున్నానని చెప్పి రూ.లక్ష వసూలు చేసింది. తీరా ఇస్తానన్న గడువు వచ్చేసరికి బాధితులు తాము ఇచ్చిన అప్పు కోసం  ఫోన్‌లు చేస్తుండడంతో పోరు పడలేక ఆ మహిళ తన తన ఇంటికి తాళం వేసి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ పెట్టుకుంది. సుమారు రూ. 5కోట్ల మేరకు ఆమె బాధితులకు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. బాధితులంతా ఆమె భర్తను కలిసి తమ డబ్బుల గురించి అడుగ్గా.. తనకు సంబంధం లేదని ఆమెనే అడగండి అంటూ చెప్పడంతో.. మీకు తెలియకుండా ఇన్ని రూ.కోట్లు ఎలా తీసుకుంది అంటూ వాగ్వాదానికి సైతం దిగారు. అయినా తనకు సంబంధం లేదని చెప్పడంతో వారు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం సివిల్‌ కోర్టులో తెల్చుకోండని పోలీసులు చెప్పారు. తమ డబ్బు ఎగ్గొట్టేందుకు పలువురు రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ను కలిసి తమ గోడు వినిపించగా.. ఆయన విచారణ చేయాలని టూటౌన్‌ పోలీసులను ఆదేశించారు.

కాగా, బాధితుల్లో ఓ పోలీస్‌ అధికారి కూడా ఉండడం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కానిస్టేబుల్‌ దంపతులు కొంతమంది ఉద్యోగులను మోసం చేసిన తీరు మరవకముందే మరో సంఘటన జరగడంతో దీనిపై పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి ఈ మాయలేడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు