బురదలో చిక్కుకున్న యువతి.. రక్షించేందుకు వెళ్లి మరో నలుగు బలి

15 Jul, 2021 07:45 IST|Sakshi
మృతులు నర్మద, జీవిత, అశ్విత, జ్యోతిలక్ష్మి, సుమతి  (ఫైల్‌)

చెన్నై: వారంతా ఒకే గ్రామానికి చెందినవారు.. పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని ఆలయ కోనేటికి వెళ్లారు. పెద్దలు గట్టుపై బట్టలు ఉతుకుతుండగా పిల్లలు సరదాగా నీటిలో దిగి ఆడుకుంటున్నారు. ఇంతలో అనుకోని ప్రమాదం. ఓ చిన్నారి నీటి మడుగులో చిక్కుకుంది. బాలికను కాపాడే క్రమంలో ఐదుగురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బుధవారం తిరువళ్లూరులో విషాదాన్ని నింపింది. 
తిరువళ్లూరు: కొలనులో చిక్కుకున్న బాలికను రక్షించే క్రమంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన తిరువళ్లూరులో  బుధవారం జరిగింది. కొత్తగుమ్మిడిపూండిలోని కరుంబుకుప్పం గ్రామానికి చెందిన రాజీ భార్య సుమతి(35), కుమార్తె అశ్విత(15), దేవేంద్రన్‌ కుమార్తె జీవిత(14), గుణశేఖరన్‌ కుమార్తె నర్మద(12), మునస్వామి భార్య జ్యోతిలక్ష్మి (30) బుధవారం ఉదయం బట్టలు ఉతకడం కోసం గ్రామం సమీపంలోని అంకాళపరమేశ్వరి ఆలయ పుష్కరిణికి వెళ్లారు.

మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

అక్కడ జ్యోతిలక్ష్మి, సుమతి పుష్కరిణి గట్టుపై బట్టలు ఉతుకుతుండగా నర్మద, అశ్విత, జీవిత కొలనులో దిగి ఆడుకుంటున్నారు. నర్మద కొలనులోని లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో బురదలో చిక్కుకుని మునిగిపోయింది. ఆ బాలికను రక్షించేందుకు మిగిలిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు నీటిలోకి దిగారు. వారందరూ బురదలో చిక్కుకుపోవడంతో అందరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎంతసేపటికీ వారు రాకపోవడంతో అక్కడికి వెళ్లిన గ్రామస్తులు పుష్కరిణి గట్టుపై చిందరవందరగా బట్టలు పడిఉండడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గంట పాటు శ్రమించి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి వైద్యశాలకు తరలించారు. సిప్‌కాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మిన్నంటిన రోదనలు 
గ్రామానికి చెందిన ముగ్గరు బాలికలు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో కరుంబుకుప్పం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత వరకు తమతో పాటు సంతోషంగా గడిపిన చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ‘డాక్టర్‌ అయ్యి కుటుంబాన్ని పోషిస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ నర్మద కుటుంబ సభ్యులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ‘అంకాళపరమేశ్వరి నా బిడ్డను తిరిగిచ్చేయ్‌’ అంటూ అశ్విత తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు