తండ్రి ట్రాక్టర్‌ కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి

3 May, 2021 09:59 IST|Sakshi

కందుగులలో విషాదం

హుజూరాబాద్‌రూరల్‌: ప్రమాదవశాత్తు తండ్రి ట్రాక్టర్‌ కింద పడి బాలుడు మృతిచెందిన ఘటన కందుగులలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మప్పు రాజు–రమాదేవి దంపతులకు వర్షిత, కార్తీకేయ(5) సంతానం. ప్రస్తుతం వరికోతల సమయం కావడంతో దంపతులిద్దరూ వ్యవసాయ పనుల్లో ఉన్నారు. ఆదివారం ఉదయం రమాదేవి ముందుగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వచ్చి ఇంట్లో సేదతీరుతున్న సమయంలో రాజు కూడా ట్రాక్టర్‌ తీసుకొని ఇంటికి వచ్చాడు.

ఈ క్రమంలో ట్రాక్టర్‌ను ఇంటి ముందు షెడ్డులో రివర్స్‌లో పెడుతున్న సమయంలో తండ్రి రాకను గమనించిన కార్తీకేయ సంతోషంతో ఇంట్లో నుంచి పరుగెత్తుకొని రావడం తండ్రి గమనించలేదు. ప్రమాదవశాత్తు కార్తీకేయ పై నుంచి ట్రాక్టరు ట్రాలీ టైరు వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రమాదవశాత్తు మృతిచెందడంతో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు టౌన్‌ సీఐ సదన్‌కుమారు తెలిపారు. 

చదవండి: ఇనుపరాడ్లతో ఆకతాయిల దాడి: ఆర్ట్‌ డైరెక్టర్‌కు గాయాలు

మరిన్ని వార్తలు