పోలీసులమంటూ బురిడీ: పక్కా స్కెచ్‌.. రూ.50 లక్షలు దోపిడీ 

4 Sep, 2021 08:57 IST|Sakshi

పోలీసులమంటూ బంగారం వర్తకుల నుంచి దోచుకెళ్లిన దుండగులు

ప్రకాశం జిల్లాలో హైవేపై ఘటన

బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి..

గుడ్లూరు(ప్రకాశం జిల్లా): పోలీసులమంటూ బంగారు వర్తకులను బురిడీ కొట్టించి వారి నుంచి రూ.50 లక్షలను దోచుకెళ్లిన ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఆగస్టు 31న జరిగింది. బాధితులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. నెల్లూరుకు చెందిన బంగారం వర్తకులు చిరంజీవి, హరి, వెంకటేష్‌ విజయవాడలో బంగారం కొనుగోలు చేసేందుకు ఆగస్టు 31న రూ.85 లక్షలతో కారులో బయలుదేరారు. ఈ కారు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్‌ వద్దకు రాగానే పోలీస్‌ యూనిఫాంలో ఉన్న నలుగురు కారును ఆపారు.

తాము డీఎస్పీ ఆఫీసు నుంచి వచ్చామని, బ్లాక్‌ మనీ తరలిస్తున్నట్టుగా సమాచారం అందిందంటూ వారిని బెదిరించారు. నలుగురిలో ముగ్గురు వారి కారులో కూర్చుని దానిని జాతీయ రహదారి మీదుగా నడపాలని చెప్పారు. నాలుగో వ్యక్తి వారు తెచ్చిన కారులో వారి వెనకాలే వచ్చాడు. మీ మీద కేసు లేకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని ముగ్గురు దొంగలు వారితో బేరమాడుతూ శింగరాయకొండ వరకూ వచ్చి కందుకూరు రోడ్డులో కారును ఆపించారు.

వర్తకులు వారికి నగదు ఇచ్చేందుకు బ్యాగులోంచి రూ.50 లక్షలు ఉన్న పార్శిల్‌ను బయటకు తీశారు. ఆ వెంటనే దొంగలు మొత్తం నగదును లాక్కుని వెనుక వచ్చిన కారులో ఎక్కి పరారయ్యారు. అనంతరం వర్తకులు తాము మోసపోయామని గ్రహించి.. గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నలుగురు దొంగలూ నెల్లూరు నుంచే పక్కా ప్రణాళికతో వర్తకుల కారును వెంబడించి దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కందుకూరు సీఐ శ్రీరామ్‌ చెప్పారు.

ఇవీ చదవండి:
వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..
గూఢచారి ‘ధ్రువ్‌’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు