సరిహద్దులో పేలిన తూటా

28 Dec, 2021 03:32 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి మృతదేహాలను ట్రాక్టర్లలో తీసుకొస్తున్న పోలీసులు  

భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ 

పెసర్లపాడు అడవుల్లో ఘటన 

భద్రాచలం మీదుగా సుకుమాకు మృతదేహాలు

చనిపోయిన వారు ఆజాద్‌ అంగరక్షకులనే అనుమానాలు 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఇంకా చీకట్లు తొలగిపోలేదు.. చలితో మన్యం వణుకుతోంది.. ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం. అరగంటకు పైగా భీకర పోరు. సోమవారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు.. మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

వారిలో నలుగురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎర్రంపాడు, చెన్నాపురం, తిప్పాపురం గ్రామాల మీదుగా ట్రాక్టర్లపై ఆంజనేయపురం వరకు తరలించి, అక్కడి నుంచి రెండు అంబులెన్సుల ద్వారా భద్రాచలం మీదుగా తిరిగి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. చనిపోయిన మావోయిస్టుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. 

అరగంట సేపు హోరాహోరీ 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పెసర్లపాడు అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి జిల్లా చర్లతో పాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా జిల్లాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, సుకుమా జిల్లాకు చెందిన డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ 141 బెటాలియన్‌ బలగాలు.. భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ నేతృత్వంలో సంయుక్తంగా కూంబింగ్‌ ఆపరేషన్‌కు బయలుదేరాయి.

ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. అర్ధగంట పాటు సాగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా ప్రాంతంలో రెండు 303 రైఫిళ్లు, మూడు డీబీబీఎల్‌ తుపాకులతో పాటు నాలుగు రాకెట్‌ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చర్ల మండలం చెన్నాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీఆర్‌పీఎఫ్‌ క్యాంపును తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించిన పది రోజులకే భారీ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం. కాగా క్రమంగా విస్తరిస్తున్న మావోయిస్టుల ఏరివేతపై జిల్లా పోలీసు యంత్రాంగానికి డీజీపీ దిశానిర్దేశం చేశారనే చర్చ జరుగుతోంది.  

చర్ల టు సుకుమా..! 
మృతదేహాలకు పోస్టుమార్టం చేసే విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ముందు ములుగు జిల్లాకు తరలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత భారీ భద్రత నడుమ అటవీ ప్రాంతం నుంచి చర్ల వరకు మృతదేహాలను తీసుకొచ్చారు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతుందని అందరూ భావించారు. కానీ భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమాకు తరలించారు.

మృతదేహాలను తరలించే సమయంలో సరిహద్దు గ్రామాలకు చెందిన ఆదివాసీలు వాహనాలను అడ్డుకునే అవకాశం ఉందని భావించిన పోలీసు బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. కాగా చనిపోయిన మావోయిస్టుల వివరాలు తెలుసుకునే యత్నం చేస్తు న్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. చర్ల–కిష్టారం పోలీస్‌స్టేషన్ల పరిధిలో మావోయిస్టులు పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులపై దాడికి వ్యూహరచన చేస్తున్నట్టుగా పక్కా సమాచారం అందిందని చెప్పారు.

దీంతో ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు. చనిపోయిన వారంతా మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి (బీకే–టీజీ) జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ అంగరక్షకులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న రాకెట్‌ లాంచర్లు, తుపాకులు

ఆపరేషన్‌ ఆజాద్‌ ఫలించలేదా..? 
ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి ఆజాద్‌ తప్పించుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఉంటూ తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆజాద్‌ను లక్ష్యంగా చేసుకుని పోలీసు బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మణుగూరు ఏరియా కమిటీ కమాండర్, ఆజాద్‌ ప్రొటెక్షన్‌ టీం సభ్యుడు మంతు ఉన్నట్లుగా తెలుస్తుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. 

మరిన్ని వార్తలు