బాలిక అదృశ్యం కేసు విషాదాంతం

4 Dec, 2021 17:16 IST|Sakshi

లక్నో: అదృశ్యమైన ఆరేళ్ల బాలిక కేసు విషాదాంతంగా ముగిసింది. రెండు రోజుల క్రితం తన ఇంటి నుంచి దుకాణానికి వెళ్లిన ఆరేళ్ల బాలిక ట్రంక్‌ బాక్సులో శవమై కన్పించింది. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హపూర్‌ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక గురువారం (డిసెంబరు 2)న సాయంత్రం ఇంటి నుంచి చాక్లెట్‌ కొనుక్కుంటానని బయటకు వెళ్లింది.

ఆ తర్వాత.. ఎంత సేపటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలిక తండ్రి ఆరోజు రాత్రంతా బాలిక కోసం వెతికారు. అయినా.. బాలిక ఆచూకీ దొరకలేదు.  ఈ క్రమంలో శుక్రవారం ఉదయాన్నే స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఇంటి తాళలను పగులగొట్టారు.

అప్పుడు వారికి ఒక ట్రంక్‌ పెట్టెలో బట్టలు, బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత.. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. బాలికను ఆ ఇంటి యజమాని బైక్‌ మీద కూర్చోబెట్టుకుని, అతని ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.కాగా, చాక్లెట్‌ కొనడానికి వెళ్లిన కూతురు.. రెండు రోజుల తర్వాత శవమై కనిపించడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమయ్యింది.  దీంతో స్థానికులు ఆ నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి పాల్పడ్డారు.

బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రిపోర్టులు వచ్చాక.. పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు