బాలికపై అత్యాచారం: నిందితుల ఊహా చిత్రాలు!

10 Aug, 2020 14:07 IST|Sakshi

లక్నో : ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన కేసును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం మైనర్‌ బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలికి పలు శస్త్ర చికిత్సలు చేసినట్లు, అలాగే సుదీర్ఘ కాలం ఆమెకు చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం బాధితురాలి తల్లిదండ్రులు, ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన ఆధారాలతో అనుమానిత నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో గురువారం ఆరేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా బైక్‌పై  వచ్చిన ఓ వ్యక్తి  బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. (కూతురిపై కన్న తండ్రి అత్యాచారం)

బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. శుక్రవారం ఉదయం పొలాల్లో ఒంటిపై తీవ్ర గాయాలతో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. అనంతరం ఆమెను మీరట్‌లోని ఆస్పత్రికి తరలించగా బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదన్నారు. చిన్నారి పరిస్థితి కారణంగా ఇప్పటివరకూ ఆమె వాంగ్మూలం నమోదు చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు గుర్తు తెలియని నిందితులపై పోక్సో, సంబంధిత కేసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, నిందితుడిని పట్టుకోటానికి 6 బృందాలు గాలింపు చేపట్టాయని హాపూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ చెప్పారు. (ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..)

మరిన్ని వార్తలు