104 రోజులు.. 631 కేసులు: పోలీసులకు సవాల్‌గా సైబర్‌ నేరాలు

11 Jul, 2021 08:49 IST|Sakshi

మాదాపూర్‌ జోన్‌లోనే 75 శాతం నమోదు

పీఎస్‌లకు అప్పగించాక పెరిగిన సైబర్‌ క్రైం కేసులు 

గచ్చిబౌలి: కస్టమర్‌ కేర్, ఉద్యోగం, రుణాలు, వ్యాపారం, ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల విక్రయాలు, గిఫ్టులు, ఫేస్‌బుక్‌.... ఇలా పలు విధాలుగా ఆన్‌లైన్‌ లో ఎరవేసి మోసాలకు పాల్పడుతున్నారు కేటుగా ళ్లు. ఒక్కో పీఎస్‌లో రోజుకో కేసు అన్న రీతిలో సైబర్‌ క్రైం కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది.  
సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబర్‌ క్రైమ్‌ కేసులను మార్చి 27 నుంచి ఆయా పీఎస్‌లకు అప్పగించిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెండింగ్‌ కేసుల్లో ఎక్కువగా సైబర్‌ క్రైం కేసులు ఉండటం ఎస్‌హెచ్‌ఓలను ఆందోళన  కలిగిస్తోంది. 
 లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యావంతులంతా ఇబ్బడిముబ్బడిగా ఆన్‌లైన్‌ షాపింగ్, ట్రేడింగ్‌లు చేసి సైబర్‌ నేగాళ్ల చేతికి చిక్కుతున్నారు. క్షణాల్లో వేలు, లక్షల్లో నష్ట పోతున్నారు. 
  సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 838 సైబర్‌ క్రైం కేసులు నమోదు కాగా మాదాపూర్‌ జోన్‌లోనే 631 కేసులు నమోదు కావడం గమనార్హం. 21 కేసులను ఛేదించి రూ.29,37,848 సీజ్‌ చేశారు. 417 కేసులు డిటెక్ట్‌ కావాల్సి ఉంది. 75 శాతం కేసులు ఐటీ కారిడార్‌ సమీపంలో ఉన్న  పీఎస్‌ల్లో నమోదవుతున్నాయి.  

నమోదైన కేసుల వివరాలు:  
 మాదాపూర్‌ జోన్‌లో మొత్తం 631 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదు కాగా.. అందులో అత్యధికంగా గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో 105 నమోదయ్యాయి. మాదాపూర్‌ పీఎస్‌లో 95 కేసులు, మియాపూర్‌లో 90, రాయదుర్గంలో 60, కూకట్‌పల్లిలో 64 నమోదయ్యాయి.  
ఇలా సైబర్‌ మోసాలు:  
 గూగుల్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్ల ద్వారా మోసం చేస్తున్నారు. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం, కొరియర్, సేవలు, బ్యాంకింగ్‌ సేవలు, ఈ కామర్స్‌ వెబ్‌ సైట్‌ల్లో లావాదేవీలు జరుపుతున్నప్పుడు నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లతో మోసగిస్తున్నారు. 
ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్ర్రాగామ్, 99 ఎకర్స్, మ్యాజిక్‌ బ్రిక్స్, నో బ్రోకర్‌ డాట్‌ కామ్, క్వికర్‌ తక్కువ ధరలో వాహనాలు, మొబైల్‌ ఫోన్ల అమ్మకానికి పెట్టడం, ఫ్లాట్లను అద్దెకు తీసుకుంటామని, ఆర్మీ అధికారులమని మోసగిస్తు న్నారు. రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్ట్‌ ఫీజు, డెలివరీ చార్జెస్‌ పేరిట క్యూర్‌ కోడ్‌ పంపించి అందికాడికి దండుకుంటున్నారు. 
 వాట్సాప్, టెలిగ్రామ్‌లలో లింకు పంపించి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మిస్తారు. ఇది నిజమేనని నమ్మి ఎవరైనా తమ అకౌంట్‌కు డబ్బులు పంపితే.. కేటుగాళ్లు మరుక్షణమే తాము పంపిన లింక్‌ పని చేయకుండా చేస్తారు. 
 నౌకరీ డాట్‌కామ్, షైన్‌ డాట్‌ కామ్, టైమ్స్‌జాబ్స్‌ డాట్‌ కామ్, ఇండీడ్‌ వంటి వెబ్‌సైట్ల నుంచి వివరాలు తీసుకుంటారు. ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మిస్తారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్‌ పేరిట దండుకుంటారు. 
 మీకు పరిచయం ఉన్న వ్యక్తి ప్రొఫైల్‌తో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లు సృష్టించి ఆపదలో ఉన్నానని చెప్పి డబ్బులు కావాలని మేసేజ్‌ చేస్తారు. అది నిజం అనుకొని డబ్బులు పంపితే వాటిని మోసగాళ్లు తమ జేబుల్లో వేసుకుంటారు.  
 కేవైసీ అప్‌డేట్‌ చేయాలని మోసగాళ్లు ఫోన్‌ చేస్తారు. టీమ్‌ వీవర్, ఎనీ డెస్క్‌ రిమోట్‌ కంట్రోల్స్‌ ద్వారా డెబిట్‌ కార్డు, అకౌంట్‌ వివరాలు తెలుసుకొని ఖాతాలోని సొమ్మును కాజేస్తారు.  
 టాటా ఫైనాన్స్, బజాజ్‌ ఫైనాన్స్‌లలో తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని నమ్మించి రిజిస్ట్రేషన్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్‌టీ పేరిట డబ్బులు దండుకొని ఉడాయిస్తారు.  
 స్నాప్‌డీల్, నాప్‌టెల్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, అమెజాన్, హోమ్‌ షాప్, షాప్‌ క్లూస్‌ తదితర ఇ–కామర్స్‌ సైట్ల పేరిట లక్షల్లో బహుమతి గెలుచుకున్నారని మెయిల్స్‌ పంపిస్తారు. వాటికి స్పందించిన వారి నుంచి రిజిస్ట్రేషన్, సర్వీస్‌ చార్జీలు, జీఎస్టీ, ప్రాసెసింగ్‌ పేరిట డబ్బులు వసూలు చేసి మోసగిస్తారు.  
తీసుకోవాల్సి జాగ్రత్తలు :  
వ్యక్తి గత వివరాలు, బ్యాంకింగ్‌ వివరాలు ఎవరితోనూ పంచుకోరాదు. 
అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులతో స్నేహం చేయరాదు. 
గుర్తింపు పొందిన వెబ్‌సైట్లలో మాత్రమే కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతకాలి 
 ఇంటర్వూ్య, గ్రూపు డిస్కషన్‌ ద్వారా మాత్రమే ఉద్యోగం వస్తుందని గమనించాలి. 
ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను లాక్‌ చేయాలి. 
 పేటీఎం, బ్యాంక్‌ అకౌంట్‌ కేవైసీ అప్‌డేట్‌ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు. 
 బహుమతులు గెల్చుకున్నారని వచ్చే ఈమెయిల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దు.  

అప్రమత్తంగా ఉండాలి.. 
రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్‌ కమిషనరేట్‌లో శాంతిభద్రతల పోలీసుస్టేషన్లలో సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఏ చిన్న సైబర్‌ మోసం జరిగినా పీఎస్‌ల్లోనే ఫిర్యాదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్, ట్రేడింగ్‌ పెరగడంతో సైబర్‌ మోసాలూ పెరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహనతోనే వీటిని నివారిచేందుకు వీలుంటుంది. విద్యావంతులే అధికంగా బాధితులవుతున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో సైబర్‌ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యావంతులు, యువత సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మెయిల్స్, మేసేజ్‌లను గుడ్డిగా నమ్మవద్దు. 
– వెంకటేశ్వర్లు, డీసీపీ, మాదాపూర్‌ 


 

మరిన్ని వార్తలు