ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి

27 Jul, 2022 18:24 IST|Sakshi
ప్రవల్లిక (ఫైల్‌), గాయపడిన చిన్నారి

సాక్షి, మెదక్‌: వారిది ప్రేమ వివాహం. ఆనందంగా సాగుతున్న వారి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ప్రమాదంలో తల్లి చనిపోవడంతో, చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ సంఘటన కొల్చారం మండల కేంద్రంలోని మెదక్‌– నర్సాపూర్‌ జాతీయ రహదారిలో మంగళవారం జరిగింది. కొల్చారం ఏఎస్‌ఐ తారాసింగ్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెౌదిన చండూరి ప్రకాశ్‌ రెండో కూతురు మృతురాలు వంకిడి ప్రవల్లికకు(23) అదే  మండలం ధర్మసాగర్‌ గ్రామానికి చెందిన వంకిడి విజయ్‌ కుమార్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగుంది. వీరిది ప్రేమ వివాహం. వీరికి 7 నెలల పాప అక్షిత సిందూర ఉంది.

పాపకు సోమవారం రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతోంది. భార్యాభర్తలిద్దరూ మెదక్‌ పట్టణంలోని ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు ధర్మసాగర్‌ నుంచి బైక్‌పై బయలుదేరారు. మండల కేంద్రం కొల్చారం లోని సత్యసాయి పారా బాయిల్డ్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైకును కొల్చారం గ్రామానికి చెందిన గుండు రామకృష్ణయ్య తన బైకుతో వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో  ప్రవల్లిక, పాప ఎగిరి కింద పడ్డారు. ప్రవల్లిక తీవ్రంగా గాయపడగా, పాప అక్షిత స్వల్పంగా గాయపడింది. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో మెదక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవల్లిక మృతి చెందింది. ఈ ప్రమాదంలో రామకృష్ణయ్యకు స్వల్పగాయాలయ్యాయి. రామకృష్ణయ్య అజాగ్రత్తగా బైకు నడపడంవల్లే ప్రమాదం జరిగిందని, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
చదవండి: అసభ్యకర మెసేజ్‌లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి

మరిన్ని వార్తలు