‘అమలాపురం అల్లర్లు’.. మరో 9 మంది అరెస్ట్‌ 

1 Jun, 2022 04:52 IST|Sakshi

71కి చేరిన మొత్తం అరెస్ట్‌లు 

కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి

అమలాపురం టౌన్‌: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 9 మంది నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 71కి చేరుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. అందులో నాలుగు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి మొత్తం 71 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. తాజాగా అరెస్టు చేసిన 9 మందిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారని పేర్కొన్నారు. నిందితులను పూర్తి ఆధారాలతో గుర్తించే అరెస్ట్‌ చేస్తున్నామన్నారు. అమలాపురంలో 144 సెక్షన్, సెక్షన్‌ 30 ఇంకా అమలులోనే ఉన్నాయని చెప్పారు. 

సోషల్‌ మీడియా గ్రూపులపై పూర్తి నిఘా.. 
సున్నితమైన విషయాలు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, ఒక వర్గాన్ని, ఒక నేతను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. అలాంటి పోస్టులు పెట్టేవారిపైనే కాకుండా ఆ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా అలాంటి అభ్యంతరకర పోస్టులు పెడితే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని రావాలని సూచించారు.

అలా కాకుండా పోస్టులు పెట్టిన వారి ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం, కొట్టడం వంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, చదువులు పూర్తయినవారే ఉన్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఈ కేసుల్లో ఉన్న నిందితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు వస్తే పోలీసు వెరిఫికేషన్‌లో అనర్హులవుతారని చెప్పారు. అలాగే విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పార్ట్‌లు కూడా మంజూరు కావని స్పష్టం చేశారు.  

3 మండలాలకు ఇంటర్నెట్‌ పునరుద్ధరణ 
సోషల్‌ మీడియాలో పుకార్ల నియంత్రణకు నిలిపివేసిన ఇంటర్నెట్‌ సేవలను మరో 24 గంటలు పొడిగించినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే కోనసీమలో 16 మండలాలకు గాను 3 మండలాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సఖినేటిపల్లి, మలికిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మిగిలిన మండలాల్లో బుధవారం కూడా ఇంటర్నెట్‌ ఉండదన్నారు. 

మరిన్ని వార్తలు