గోడ కూలి 11 మంది దుర్మరణం

14 Oct, 2020 02:24 IST|Sakshi

 మరో నలుగురికి గాయాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడ మహ్మదియా నగర్‌లోని ఓ పహిల్వాన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ గ్రానైట్‌ గోడ కూలి పక్కనే ఉన్న రెండిళ్లపై పడింది. ఈ ఘటనలో 11మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని పోలీసులు మొగల్‌పురలోని అస్రా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ అసద్, ఎమ్మెల్యే అక్బర్‌ పరామర్శించారు. గ్రానైట్‌ రాయితో నిర్మించిన ఈ గోడ పాతది కావడం.. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కూలి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మరో ఘటనలో తల్లీకూతుళ్లు మృతి..
ఇబ్రహీంపట్నం(హైదరాబాద్‌): ఇంటిగోడ కూలిపోయి తల్లీ కూతుళ్లు మృతి చెందగా కుమారుడుకి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మల్‌శెట్టిగూడలో క్యామ సువర్ణ(37) కూతురు స్రవంతి (14), కుమారుడు సంపత్‌ (18)తో కలసి ఓ ఇంటిలో నివాసముంటోంది. సోమవారం నుంచి వర్షం కురుస్తుండటంతో ఇంటి గోడలు బాగా నానిపోయాయి. దీంతో రాత్రి 8 గంటల సమయంలో ఇంటి పైకప్పు గోడలు కూలి సువర్ణ, స్రవంతి, సంపత్‌లపై పడ్డాయి. తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు సంపత్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే అతడిని ఇబ్ర హీంపట్నం ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు