అమెరికాలో మళ్లీ కాల్పులు

18 Mar, 2021 03:39 IST|Sakshi
అక్వర్త్‌లో కాల్పులు జరిగిన మసాజ్‌ సెంటర్‌

ఎనిమిది మంది మృతి

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో వరస కాల్పులు కలకలం రేపాయి. ఒక గంట వ్యవధిలోనే మూడు వేర్వేరు మసాజ్‌ సెంటర్లలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు ఆసియా దేశాలకు చెందినవారే ఉన్నారు. కాల్పులకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అట్లాంటా పోలీసు చీఫ్‌ రాడ్నీ బ్రియాంట్‌ తెలిపిన వివరాలు ప్రకారం ఉత్తర అట్లాంటాకు 50 కి.మీ. దూరంలోని గ్రామీణ ప్రాంతమైన అక్వర్త్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు యంగ్స్‌ ఆసియన్‌ మసాజ్‌ పార్లర్‌లో తుపాకుల మోత మోగింది.

ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలు అవుతుండగా అట్లాంటాకి సమీపంలోని బక్‌హెడ్‌లోని గోల్డ్‌ స్పాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ మసాజ్‌ సెంటర్‌లో దోపిడి జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు వచ్చి చూడగా ముగ్గురు మహిళలు విగతజీవులై పడి ఉన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న మరో వీధిలో అరోమాథెరపీ స్పాలో కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు చీఫ్‌ వివరించారు. ఈ బీభత్సకరమైన హింసాకాండలో బాధి తుల కోసం మేమంతా ప్రార్థనలు చేస్తున్నామంటూ అట్లాంటా గవర్నర్‌ బ్రెయిన్‌ కెంప్‌ ట్వీట్‌ చేశారు.  

కాల్పులు జరిపింది ఒక్కడేనా ?  
అక్వర్త్‌ ఘటనలో కాల్పులకు తెగబడినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్పా బయట అతను తిరుగుతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్‌ ఆరన్‌ లాంగ్‌గా అతనిని గుర్తించారు. మిగిలిన రెండు చోట్ల కాల్పులు జరిపింది అతని పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి వీడియోలో కనిపించిన కారు, కాల్పులు జరిగిన ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించింది. కరోనా వైరస్‌ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆసియన్‌ అమెరికన్లపై దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ కాల్పులు కూడా అందులో భాగమేనన్న ఆందోళన పెరుగుతోంది. మరోవైపు అక్వర్త్‌లో యంగ్స్‌ ఆసియన్‌ మసాజ్‌ పార్లర్‌లో మరణించిన వారందరూ దక్షిణ కొరియాకి చెందిన మహిళలేనని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు