వేధింపులు భరించలేకే చనిపోతున్నాం 

8 Nov, 2020 10:36 IST|Sakshi

వెలుగులోకి అబ్దుల్‌సలాం కుటుంబ సభ్యుల సెల్ఫీ వీడియో

నంద్యాల/బొమ్మలసత్రం(కర్నూలు జిల్లా): పోలీసుల వేధింపుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అబ్దుల్‌సలాం కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. అబ్దుల్‌సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదాఖలందర్, కుమార్తె సల్మా ఈ నెల 3వ తేదీన పాణ్యం మండలం కౌలూరు వద్ద  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం అప్పట్లో తెలియలేదు. అయితే... తాజాగా వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియోలో అబ్దుల్‌సలాం, నూర్జహాన్‌ కన్నీటి పర్యంతమవుతూ పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని వాపోయారు. వెంటాడిన కష్టాలు.. నంద్యాలలోని రోజాకుంటకు చెందిన అబ్దుల్‌గఫార్, రసూల్‌బీ దంపతులకు నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. చిన్నవాడైన అబ్దుల్‌సలాం పాఠశాలకు వెళ్లేటప్పుడే ఖాళీ సమయంలో పక్కనే ఉన్న బంగారు దుకాణంలో పని చేసేవాడు. 

తల్లిదండ్రుల మృతి తర్వాత చదువు మానేసి గాందీచౌక్‌లోని వెంకన్న వర్మకు చెందిన బంగారు దుకాణంలో గుమాస్తాగా చేరాడు. 2004లో మూలసాగరానికి చెందిన నూర్జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సల్మా, దాదాఖలందర్‌ సంతానం. గుమాస్తా పని చేసుకుంటూనే తనకు తెలిసిన వారితో అగ్రిగోల్డ్‌ డిపాజిట్లు కట్టించాడు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో తన ఇంటిని రూ.10 లక్షలకు విక్రయించి డిపాజిట్‌దారులకు నగదు చెల్లించాడు. కాగా.. గత ఏడాది నవంబర్‌ 7న అర్ధరాత్రి అబ్దుల్‌సలాం పని చేస్తున్న దుకాణంలో దొంగలు చొరబడి కేజీన్నర బంగారాన్ని అపహరించారు. ఈ కేసులో పోలీసులు అబ్దుల్‌సలాంను నిందితుడిగా చేర్చారు. విచారణ నేపథ్యంలో కర్నూలు సీసీఎస్‌లో చిత్రహింసలు పెట్టి కేసులు ఒప్పుకొనేలా చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.

అనంతరం సలాంను రిమాండ్‌కు తరలించారు. ఇంట్లో ఉన్న బంధువుల బంగారు ఆభరణాలు దాదాపు 50 తులాలను రికవరీ కింద పోలీసులు తీసుకెళ్లారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన సలాం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నూర్జహాన్‌ పిల్లలు చదువుకునే పాఠశాలలోనే టీచర్‌గా వెళుతూ భర్తకు చేదోడుగా ఉండేది. కష్టాల నుంచి గట్టెక్కుతున్నామని సంతోషించేలోగానే పోలీసులు మరో చోరీ కేసును తెరపైకి తెచ్చారు. ఈ నెల 2వ తేదీన గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన భాస్కరరెడ్డి.. సలాం ఆటోలో ప్రయాణిస్తుండగా రూ.70 వేల నగదు మిస్సయ్యింది. ఈ విషయంపై పోలీసులు విచారణకు పిలిచారు. సలాంతో పాటు భార్య నూర్జహాన్, అత్త మాబున్నీసా స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ సలాంను, భార్యను పోలీసులు దూషించడమే కాకుండా..మరుసటి రోజు మళ్లీ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. దీంతో భయపడిపోయిన  సలాం ఈ నెల 3న భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు సీసీఎస్‌ పోలీసుల వేధింపులే కారణమని  అబ్దుల్‌సలాం అత్త మాబున్నీసా అంటున్నారు.   
   

మరిన్ని వార్తలు