రూ. 40 వేలు.. ఓ విస్కీ బాటిల్‌

17 Dec, 2020 19:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : 40 వేల రూపాయలు, ఓ విస్కీ బాటిల్‌ లంచంగా అడిగిన ఓ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌కు చెందిన ఓ పురపాలక కాంట్రాక్టర్ కరోనా సమయంలో‌ మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై జరిమానాలు విధించండని క్లీన్‌ అప్‌ మార్షల్స్‌ను ఆదేశించాడు. వారు కాందివ్లీకి చెందిన ఓ వ్యక్తికి జరిమానా వేశారు. దీంతో ఆ వ్యక్తి బంధువొకరు కాంట్రాక్టర్‌ ఇంటి వద్దకు చేరుకుని గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్‌, కాంట్రాక్టర్‌ ఇద్దరు తమ్ముళ్లు అతడిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్‌, అతడి తమ్ముళ్లపై కేసు పెట్టాడు. (తీవ్ర విషాదం: పెన్నానదిలో ఏడుగురు గల్లంతు)

ఈ ఫిర్యాదు మేరకు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు చర్‌కాప్‌ పోలీసులు. వారి సెల్‌ఫోన్లు, సీసీటీవీ డీవీఆర్‌ మిషిన్లను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత కాంట్రాక్టర్‌ చర్‌కాప్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. సెల్‌ఫోన్లు, డీవీఆర్‌ మిషిన్లు తిరిగివ్వాలని కోరాడు. పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ భరత్‌ డోమ్‌బ్రే ఇందుకోసం లంచం అడిగాడు. వస్తువులు తిరిగివ్వాలంటే 40 వేల రూపాయలు, ఓ విస్కీ బాటిల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. చివరకు 20 వేలకు బేరం కుదిరింది. అయితే సదరు కాంట్రాక్టర్‌ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు భరత్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు