ఏసీబీ దడ.. పైనుంచి కింది స్థాయిలో పర్సంటేజీలు!

29 Jan, 2021 09:28 IST|Sakshi
పీఆర్‌ ఏఈని అరెస్టు చేసి తీసుకెళ్తున్న ఏసీబీ అధికారులు

సాక్షి, ఆదిలాబాద్‌: రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్‌రూరల్‌ ఏఈ చంద్రశేఖర్‌ ఏసీబీకి పట్టుబడిన వ్యవహారం పంచాయతీరాజ్‌ శాఖలో కలకలం కలిగిస్తోంది. నడి రోడ్డు మీదా కాంట్రాక్టర్‌ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అధికారి దొరికిపోయాడు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసుల్లో రూ.2 లక్షలు పట్టుబడటం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016– 17 సంవత్సరంలో రెబ్బెన తహసీల్దార్‌ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయితే ప్రస్తుత వ్యవహారంలో ఒక్క ఏఈకే సంబంధం ఉందా.. పర్సంటేజీ రూపంలో మిగితా అధికారులకు   ముట్టాల్సిన రుక్కం కూడా ఉందా అన్న చర్చ సాగుతోంది. ప్రధానంగా పంచాయతీరాజ్‌ శాఖలో ప్రతీ పనికి సంబంధించిన బిల్లు మంజూరులో కింది నుంచి పైస్థాయి వరకు నిర్ధారిత పర్సంటేజీ ఉండడమే దీనికి కారణం. ఏసీబీ విచారణలో ఈ వ్యవహారం కూడా బయటకు వస్తుందా అనేది వేచిచూడాల్సిందే. 

అనేక పద్దులు.. కోట్ల విలువైన పనులు
పంచాయతీరాజ్‌ శాఖలో అనేక పద్దుల్లో కోట్ల రూపాయల విలువైన పనులు జిల్లాలో నడుస్తున్నాయి. పద్దుల పరంగా గమనిస్తే.. జెడ్పీ జనరల్‌ ఫండ్, నాబార్డు, ఎస్‌ఎఫ్‌సీ, సీఆర్‌ఆర్, పీఎంజీఎస్‌వై, సీబీఎఫ్, ఎంపీ ల్యాడ్స్, సీడీపీ నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైకుంఠధామాలు, రైతు వేదికలు కూడా ఈ శాఖ ఆధ్వర్యంలోనే ఉంటాయి. రోడ్లు, భవనాల నిర్మాణ పనులు జోరుగా సాగుతుంటాయి. అయితే ఈ శాఖలో క్షేత్రస్థాయి నుంచి పై అధికారుల వరకు పర్సంటేజీల రూపంలో ప్రతీ పనిలో నిర్ధారిత మొత్తం బిల్లు చెల్లించే ముందు కాంట్రాక్టర్‌ ఇవ్వడం జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. ఇందులో పని విలువపై క్షేత్రస్థాయిలో అధికారులకు 5శాతం, డివిజన్‌ స్థాయి అధికారులకు 3 శాతం, జిల్లా స్థాయి అధికారులకు 2 శాతం కాంట్రాక్టర్ల నుంచి నేరుగా ముడుతాయి. దొరక్కపోతే పర్సంటేజీ.. దొరికితే లంచం అన్నట్టు.. ప్రస్తుతం ఏసీబీ దాడితో అంత పెద్ద మొత్తం లంచమా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతున్నప్పటికీ ఈ శాఖలో ఇది ‘మామూలే’.   

మరిన్ని వార్తలు