ఏసీబీ వలలో రెవెన్యూ చేప!

21 Mar, 2021 15:10 IST|Sakshi

పాల్వంచరూరల్‌: కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.3,500 లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాల్వంచ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్‌ మోహన్‌ చక్రవర్తి పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి కోట అరుణ్‌సాయి ఫ్యామిలీ మెంబర్ల సర్టిఫికెట్‌ కోసం గత ఫిబ్రవరి 12న మీ సేవ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి సర్టిఫికెట్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు స్పందించడంలేదు. సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే కొంత ముట్టజెప్పాలంటూ జూనియర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌ మోహన్‌ చక్రవర్తి వేధించాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ( ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌కు రూ.3,500 లంచం ఇచ్చాడు. అప్పటికే నిఘావేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఆనంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఖమ్మం ఇన్‌చార్జి డీఎస్పీ మధుసూదన్‌ తెలిపారు. దాడిలో ఖమ్మం ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రమణమూర్తి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

పాల్వంచ తహశీల్‌లో పెచ్చుమీరుతున్న అవినీతి
పాల్వంచ తహసీల్దార్‌ కార్యాలయంలో ఉద్యోగుల అవినీతి రోజురోజుకూ మితిమీరిపోతోంది. లంచం ఇవ్వనిదే ఏపనీ చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్ట్‌లో ఇదే తహసీల్దార్‌ కార్యాలయంలో యానంబైల్‌కు చెందిన ఓ మహిళ కల్యాణలక్ష్మి పథకం మంజూరు కోసం వీఆర్వో పద్మను సంప్రదించగా.. రూ. 10 వేలు డిమాండ్‌ చేసింది. విసిగిపోయిన బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వీఆర్వో సదరు మహిళ నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా జూనియర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇతను ఇసుక ట్రాక్టర్లదారుల నుంచి అధిక మొత్తంలో డిమాండ్‌ చేస్తూ, భారీగా అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు