అటవీశాఖ సెక్షన్‌ అధికారి.. రూ. 15 వేలు లంచం డిమాండ్‌..

27 Jul, 2021 08:29 IST|Sakshi

సాక్షి, అశ్వాపురం(ఖమ్మం): నెల్లిపాక అటవీశాఖ సెక్షన్‌ అధికారి పూనెం నాగరాజు ఓ వ్యక్తి వద్ద రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీ.రమణమూర్తి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన బాణోత్‌ వీరన్న మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కనున్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్‌ నిర్మించుకున్నాడు.

అయితే నాగరాజు ఆ షెడ్‌ను కూల్చి.. రేకులు, స్తంభాలను తీసుకొచ్చి  మొండికుంటలో ఫారెస్ట్‌ నర్సరీలో పెట్టాడు. వీరన్న స్తంభాలు ఇవ్వాలని కోరితే రూ.15వేలు ఇవ్వాలని నాగరాజు డిమాండ్‌ చేశాడు. దీంతో వీరన్న 10 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి  ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, సోమవారం ఖమ్మం ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీ.రమణమూర్తి ఆధ్వర్యంలో మొండికుంట ఫారెస్ట్‌ నర్సరీకి వచ్చి వీరన్నతో నాగరాజుకు ఫోన్‌ చేయించారు.

తాను భద్రాచలం బస్టాండ్‌లో ఉన్నానని, డబ్బులు తీసుకొని అక్కడికి రావాలని నాగరాజు సూచించాడు. దీంతో భద్రాచలం బస్టాండ్‌లో వీరన్న వద్ద నుంచి నాగరాజు రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడులలో ఏసీబీ సీఐలు శ్రీనివాస్, రవి, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు