లంచం అడిగి అడ్డంగా దొరికాడు.. ఇంటికి వెళ్లి వస్తాను సార్‌ వదలండి!

29 Jun, 2022 10:12 IST|Sakshi
లంచం తీసుకుంటూ దొరికిపోయిన బాడ లక్ష్మీపతి, పక్కనే ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి

సాక్షి,కాశీబుగ్గ(శ్రీకుకుళం): కాశీబుగ్గ జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం(కాశీబుగ్గ సర్కిల్‌)లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాడ లక్ష్మీపతి మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. రూ.8వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించిన వివరాల మేరకు.. 

కవిటి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యా పారి జీఎస్టీ నిబంధనల మేరకు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ప్రభుత్వం నుంచి రూ.82 వేలు రిఫండ్‌ రావాల్సి ఉందని తెలుసుకున్నారు. ఏప్రిల్‌ నెలలో తన రిటర్న్స్‌ చూసు కుని రూ.82వేలు అందాల్సిందిగా నిర్ధారించుకు ని తనకు రావాల్సిన నగదు కోసం కాశీబుగ్గ జీఎస్‌టీ కార్యాలయం, అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న బాడ లక్ష్మీపతిని సంప్రదించారు. అయితే ఈ ఫైలు ముందుకు పంపించాలంటే తనకు రూ.10వేలు లంచం ఇవ్వాలని లక్ష్మీపతి డిమాండ్‌ చేశారు.

ఆ వ్యాపారి లంచం ఇవ్వడం ఇష్టం లేక మూడు నెలలుగా తనకు రావాల్సిన రిఫండ్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా రు. అయితే ఎంతకూ ఫైలు ముందుకు కదలకపోవడంతో శ్రీకాకుళంలోని అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ వ్యాపారి జూనియర్‌ అసిస్టెంట్‌ వద్దకు వెళ్లి రూ.10వేలు ఇవ్వలేనని రూ.8వేలు ఇస్తానని చెప్పారు. ఫోన్‌ పే చేయాలని లక్ష్మీపతి సూచించగా.. అలా చే యకుండా ఏసీబీ అధికారులు చెప్పినట్లు మంగళవారం జూనియర్‌ అసిస్టెంట్‌ చాంబర్‌లోకి వెళ్లి రూ.8వేలు ఇచ్చారు.

సరిగ్గా అదే సమయానికి అక్కడే మాటు వేసి ఉన్న డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ బృందం అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ మేరకు వ్యాపారి నుంచి వాంగ్మూలం తీసుకొని జూనియర్‌ అసిస్టెంట్‌ను విచారించి అక్కడున్న పెండింగ్‌ ఫైల్స్‌ పరిశీలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జూనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మిపతిని అరెస్టు చేశామని, బుధవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ప్రకటించారు. 

ఇంటికి వెళ్లి వస్తాను.. విడిచి పెట్టండి
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 20వ వార్డు శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాడ లక్ష్మీపతికి 2013లో వివాహం జరగ్గా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తండ్రి జీఎస్టీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో తండ్రి ఉద్యోగం ఆయనకు 2017 లో వచ్చింది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన తర్వాత లక్ష్మీపతి ఇంటికి వెళ్తానంటూ, ఇంటి వారితో ఫోన్‌లో మాట్లాడతానంటూ ఏసీబీ అధికారులను కోరగా.. వారు దానికి అనుమతి ఇవ్వలేదు. వాంగ్మూలం తీసుకున్నాక కారులో తరలించారు.   

మరిన్ని వార్తలు