ఏసీబీ కొరడా: మాజీ మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు 

13 Aug, 2021 07:39 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: గత ప్రభుత్వ అవినీతిపై ఏసీబీ ఝుళింపించిన కొరడా ఉచ్చు.. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చుట్టూ గట్టిగా బిగుస్తోంది. చెన్నై, కోయంబత్తూరు కార్పొరేషన్లలో రూ.811 కోట్ల టెండర్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ఇటీవల జరిపిన దాడుల ద్వారా నిర్ధారించుకున్నారు. వేలుమణి, సహా ఏడుగురిపై, 10 కార్యాలయాలపై కేసులు పెట్టారు. ఈ అక్రమాల వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందని ఏసీబీ అనుమానిస్తోంది.  

గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఆరోపించడంతోపాటూ విచారణ జరపాల్సిందిగా గవర్నర్‌కు అప్పట్లో వినతిపత్రం సమర్పించారు. కొందరు డీఎంకే అగ్రనేతలు అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం పట్టించుకోనందున డీఎంకే నేతలు కోర్టుకెక్కడంతో న్యాయస్థానం అదేశాలతో ఏసీబీలో కదలిక వచ్చింది. అంతేగాక స్టాలిన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నాడీఎంకే ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతిపై దృష్టి సారించారు. గతంలో డీఎంకే అగ్రనేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఇందులో భాగంగా మాజీ మంత్రి వేలుమణి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగాయి. వేలుమణి బినామీగా భావిస్తున్న కేసీపీ మేనేజింగ్‌ డైరక్టర్‌ చంద్రప్రకాష్‌కు చెందిన ఎంశాండ్‌ క్వారీ కార్యాలయం నుంచి రెండు సంచుల నిండా డాక్యుమెంట్లను ఏసీబీ స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేగాక వేలుమణి, తదితరుల బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. మంత్రి హోదాలో వేలుమణి అక్రమాలకు అండగా నిలిచిన అధికారులను విచారించి ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని ఏసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు