పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు

1 Jun, 2022 07:50 IST|Sakshi

సనత్‌నగర్‌: విద్యుత్‌ మీటర్లు మంజూరు చేస్తామంటూ లంచం తీసుకున్న ఏఈతో పాటు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ భాస్కర్‌రెడ్డి మూసాపేటలోని ఓ భవనానికి 20 విద్యుత్‌ మీటర్ల కోసం గత  ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. సనత్‌నగర్‌ ఎలక్ట్రికల్‌ ఏఈ అవినాష్, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కృపానంద్‌ రెడ్డిలు రేపు మాపు అంటూ భాస్కర్‌రెడ్డిని తిప్పించుకుంటున్నారు.

డబ్బులు ముట్టజెబితేనే పని అవుతుందని కరాఖండీగా చెప్పారు. ఏఈకి రూ.25,000, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌కు రూ.7500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో గత్యంతరం లేక ఈ నెల 18న ఏఈకి రూ.10,000, 19న లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు రూ.3,500ను భాస్కర్‌రెడ్డి ఇచ్చారు. దీంతో కేవలం ఐదు మీటర్లను మాత్రమే వారు మంజూరు చేసి మిగతా మీటర్లను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన డబ్బులు కూడా ఇస్తేనే మీటర్లను మంజూరు చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక భాస్కర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

మంగళవారం సనత్‌నగర్‌లోని విద్యుత్‌ ఏఈ కార్యాలయంలో అవినాష్‌కు రూ.10,000, కృషానంద్‌రెడ్డికి రూ.4,000ను ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇరువురు అధికారులను అరెస్టు చేసి ఏఈ, లైన్‌ ఇన్‌స్పెక్టర్లకు చెందిన కూకట్‌పల్లి, బోరబండలలోని వారి ఇళ్లలో సోదాలు కొనసాగించారు.  

(చదవండి: ఫోనొచ్చింది ఆపండహో!)

మరిన్ని వార్తలు