పోలీసుల తంటాలు: పోస్టింగ్‌లకు అప్పులు.. తీర్చేందుకు లంచాలు..

30 Jun, 2021 08:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జగిత్యాల క్రైం: విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతతో శాంతిభద్రతల పర్యవేక్షణలో నిత్యం ముందుండే పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలు ఇచ్చుకోలేని బాధితులు వారిని ఏసీబీకి పట్టిస్తుండటంతో పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. 15 రోజుల వ్యవధిలో జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సైలు, ఒక డ్రైవర్, ఒకస్టేషన్‌ రైటర్‌ డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల పట్టణ ఎస్సై శివకృష్ణ డిమాండ్‌ మేరకు ఆయన డ్రైవర్‌కు ఈ నెల 17న మెట్‌పల్లికి చెందిన బెజ్జారపు రాజేశ్‌ రూ.30 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

కరీంనగర్‌ జిల్లా గంగాధర టౌన్‌ ఏఎస్సై పటేల్‌ చంద్రారెడ్డి ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్‌ చేయగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకొని, కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ ఎస్సై పృథ్వీధర్‌గౌడ్‌ కోరుట్ల మండలం నాగులపేటకు చెందిన ఉప్పలపల్లి నాగరాజు ఇసుక ట్రాక్టర్‌ను 3 రోజుల క్రితం పట్టుకున్నారు. దాన్ని తిరిగి అప్పగించాలంటే రూ.15 వేలు డిమాండ్‌ చేశారు. ఎస్సైతో నాగరాజు రూ.10 వేలకు ఒప్పందం చేసుకొని, ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఆదివారం అతను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డబ్బులు ఇస్తానని ఎస్సైకి ఫోన్‌ చేశాడు. ఆయన సూచన మేరకు రైటర్‌ రమేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ పట్టుకున్నారు. రైటర్‌తోపాటు ఎస్సై పృథ్వీధర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసు శాఖపై వరుస ఏసీబీ దాడులు కొనసాగుతుండటంతో పోలీసు శాఖలో కలవరం మొదలైంది. 

రాజకీయ నాయకులకు ముడుపులు
జిల్లాలో పని చేస్తున్న ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు కోరిన చోట పోస్టింగ్‌ కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ వారికి ముడుపులు చెల్లించుకుంటున్నారు. మూడు రోజులుగా సిఫారసు లెటర్లు తెచ్చుకుంటూ ఆయా ఠాణాల్లో పోస్టింగ్‌ పొందుతున్నారు. ఇందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు పోలీసులు సివిల్‌ పంచాయితీలు భూ సెటిల్‌మెంట్లు, ఇసుక మాఫియా, గుట్కా దందాను ప్రోత్సహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.  బాధితుల నుంచి లంచాలు.. రాజకీయ నాయకులకు ముడుపులు..

వీఆర్‌కు నలుగురు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు?
జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు ఎస్సైలు, రాయికల్, మల్లాపూర్‌లకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న మరో నలుగురు కానిస్టేబుళ్లపై డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిని వీఆర్‌కు అటాచ్‌ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మిగతా వారి పనితీరును కూడా ఎస్పీ సింధూశర్మ 2, 3 రోజులకోసారి ఎస్బీ అధికారుల ద్వారా పరిశీలించనున్నట్లు తెలిసింది. 

డబ్బులడిగితే ఫిర్యాదు చేయండి
పోలీస్‌స్టేషన్లకు న్యాయం కోసం వెళ్లే బాధితుల నుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే జిల్లా పోలీసు శాఖ వాట్సాప్‌ నంబర్‌ 93469 87153కు ఫిర్యాదు చేయండి. లేదా ఠాణాలో ఏర్పాటు చేసిన బోర్డులపై ఉన్న ఉన్నతాధికారుల నంబర్లకు ఫోన్‌ చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీస్‌స్టేషన్‌లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా వసూళ్లకు పాల్పడితే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం.

– ఎస్పీ సింధూశర్మ, జగిత్యాల  

మరిన్ని వార్తలు