బయోటెక్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం 

5 Aug, 2022 03:41 IST|Sakshi
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్మికులు

ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి

ఫిల్టర్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఘటన

విచారణ జరుపుతున్న అధికారులు  

దేవరపల్లి: ఓ బయోటెక్‌ ఫ్యాక్టరీలో ఫిల్టర్‌ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని పరమేశు బయోటెక్‌ ఫ్యాక్టరీలో గురువారం జరిగింది. స్థానిక ఎస్సై కె.శ్రీహరి తెలిపిన వివరాలు.. ఒడిశాకు చెందిన డోమా బీరువా(24), కొవ్వూరు మండలం తిరుగుడుమెట్టకు చెందిన గాజుల శ్రీను(25) పరమేశ్‌ బయోటెక్‌ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు.

ఫ్యాక్టరీలో చాలాకాలంగా వాడుకలో లేని ట్యాంకును శుభ్రం చేసేందుకు డోమా గురువారం లోపలికి దిగాడు. విషవాయువు వల్ల గాలి ఆడకపోవడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. ఇది గమనించిన శ్రీను.. డోమాను రక్షించేందుకు లోపలికి వెళ్లాడు. తను కూడా ఊపిరాడక లోపలే పడిపోయాడు. వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించిన మరో కార్మికుడు అనిల్‌సింగ్‌ కూడా స్పృహ కోల్పోయాడు. ఇది గుర్తించిన కార్మికులంతా ట్యాంకు లోపల పడిపోయిన ముగ్గురినీ తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు.

యాజమాన్యం ఆదేశాల మేరకు వారిని చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాజుల శ్రీను, డోమా మార్గం మధ్యలోనే మృతి చెందగా అనిల్‌ను మెరుగైన చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. అనిల్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

అధికారులు ఫ్యాక్టరీకి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. ఫ్యాక్టరీలో కార్మికులకు కల్పించిన సదుపాయాలు, రక్షణ పరికరాలను పరిశీలిస్తున్నామన్నారు. మొక్కజొన్న నుంచి పాలు ఫిల్టర్‌ చేసే ఈ ట్యాంకును చాలా కాలంగా వాడటం లేదని తెలిసింది. 

మరిన్ని వార్తలు