తిరుమల మొదటి ఘాట్‌లో ప్రమాదం

12 Sep, 2021 04:16 IST|Sakshi

కారు అదుపుతప్పి రక్షణ గోడకు ఢీ

వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి గాయాలు

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన  ఘటన శనివారం చోటుచేసుకుంది. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం, మెదక్‌ జిల్లా, పటాన్‌చెరువుకు చెందిన శివలింగ గౌడ్‌ (32), కృష్ణ, గోపాల్‌ అనే స్నేహితులతో కలిసి కారులో శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు చేరుకున్నాడు. శ్రీవారిని దర్శించుకుని శనివారం మధ్యాహ్నం కారులో మొదటిఘాట్‌ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా రెండో టర్నింగ్‌ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణగోడను వేగంగా ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారులో ముందర కూర్చున్న శివలింగ గౌడ్‌ ముఖం ముందర అద్దానికి కొట్టుకుని తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్‌ సీట్లో ఉన్న కృష్ణ సీటు బెల్టు పెట్టుకోవడంతోపాటు, బెలూన్‌ ఓపెన్‌ కావడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వెనుక సీటులో కూర్చున్న గోపాల్‌ స్వల్పగాయాలతోనే బయటపడ్డాడు. తిరుమల ట్రాఫిక్, టీటీడీ భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ రుయా ఆస్పత్రికి తరలించారు. కారు టైరు పంచర్‌ కావడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవింగ్‌ సీటులో ఉన్న కృష్ణ తెలిపారు. ప్రమాదంపై తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు