ప్రియుడే కాలయముడు

26 Jun, 2022 08:18 IST|Sakshi

అనంతపురం క్రైం: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో చోటు చేసుకున్న వివాహిత కేసులో నిందితుడిని ఏడాదిన్నర తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేశారు. హతురాలికి చెందిన 2.5 తులాల తాళిబొట్టు చైన్‌ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.  
అనంతపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఈశ్వర్‌కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరితో వివాహమైంది. పెళ్లికి ముందు రాజేశ్వరి ఆదోనికి చెందిన చౌదరి హిదాయతుల్లా అలియాస్‌ ఇనాయతుల్లా మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత హిదాయతుల్లా కొన్నాళ్ల పాటు కువైట్‌కు వెళ్లాడు.

ఆ సమయంలోనే రాజేశ్వరికి ఈశ్వర్‌తో కుటుంబ పెద్దలు వివాహం జరిపించారు. కువైట్‌ నుంచి వచ్చిన తర్వాత రాజేశ్వరితో హిదాయతుల్లా చాలా చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రూ.2 లక్షలు రాజేశ్వరికి అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బును తిరిగి ఇవ్వాలని తరచూ అడిగినా.. రాజేశ్వరి మాట దాటవేస్తూ వస్తుండడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 2020, ఆగస్టు 28న హిదాయతుల్లా ఆదోని నుంచి అనంతపురానికి వచ్చాడు.

రాజేశ్వరిని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఆర్‌ఎం కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. తానిచ్చిన డబ్బు తిరిగివ్వాలని గొడపడ్డాడు. తన వద్ద లేవని రాజేశ్వరి తెలపడంతో ఆమె గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం రాజేశ్వరి మెడలోని తాళిబొట్టు చైన్‌ తీసుకుని ఉడాయించాడు. పోలీసులు మొదట్లో మిస్సింగ్‌ కేసుగా, తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హిదాయతుల్లాగా నిర్ధారించుకున్నారు.

కాగా, రాజేశ్వరిని హతమార్చిన అనంతరం భార్యాపిల్లలను ఆదోనిలోనే ఉంచి హిదాయతుల్లా నెల్లూరుకు మకాం మార్చాడు. అక్కడ ఓ పండ్ల వ్యాపారి వద్ద కూలి పనులతో జీవనం సాగించసాగాడు. శనివారం అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద తచ్చాడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన త్రీటౌన్‌ సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్‌ఐలు జయపాల్‌ రెడ్డి, వలిబాషు, సునీత, వెంకటేశ్వర్లు, బలరాం తదితరులను డీఎస్పీ అభినందించారు.  

(చదవండి: పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు)

మరిన్ని వార్తలు