వివాహేతర సంబంధమే ప్రాణాలు బలిగొంది 

25 Aug, 2022 09:36 IST|Sakshi

గార్లదిన్నె: వివాహేతర సంబంధం కారణంగానే గార్లదిన్నె మండలం కేశవాపురానికి చెందిన రాజేష్‌ (23) హతమయ్యాడంటూ పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ నెల 20న రాజేష్‌ హత్య వైనం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను బుధవారం గార్లదిన్నె పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

గార్లదిన్నెలోని భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీలో హెల్పర్‌గా పనిచేస్తున్న రాజేష్‌.... కేశవాపురానికి చెందిన వీరాంజనేయులు భార్య సౌజన్యతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయంగా పద్ధతి మార్చుకోవాలని రాజేష్‌ను వీరాంజనేయులు పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో రాజేష్‌ హత్యకు పథకం రచించాడు.

ఈ నెల 18 నుంచి రాజేష్‌ కనిపించకుండా పోయాడు. ఘటనపై శనివారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే   వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ నెల 18న విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరిన రాజేష్‌ను రామదాస్‌పేట సమీపంలో అడ్డుకుని కనంపల్లి  అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి రాళ్లతో దాడి చేసి, అక్కడే పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వీరాంజనేయులు అంగీకరించాడు.

ఈ కేసులో వీరాంజనేయులతో పాటు సహకరించిన కదరకుంటకు చెందిన మల్లెల మధు, పామిడి నివాసి మధు, సౌజన్యను మంగళవారం సాయంత్రం పెనకచెర్ల డ్యాం మార్గంలోని శివాలయం వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రాళ్లు, పార, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.    

(చదవండి: అనంత‌లో టీడీపీ నేత‌ల దౌర్జన్య కాండ)

మరిన్ని వార్తలు