త్రిబుల్‌ మర్డర్‌ కేసులో ముద్దాయికి ఉరి

20 Oct, 2022 03:44 IST|Sakshi
కరీముల్లా (ఫైల్‌)

భార్యపై అనుమానం, కుటుంబంపై కోపంతో తల్లి, చెల్లి, తమ్ముడిని చంపిన కరీముల్లా

కోర్టులో నేరాన్ని అంగీకరించిన ముద్దాయి.. ఉరిశిక్ష విధిస్తూ ప్రొద్దుటూరు కోర్టు తీర్పు  

ప్రొద్దుటూరు క్రైం: త్రిబుల్‌ మర్డర్‌ కేసులో ముద్దాయి కరీముల్లాకు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్‌ వీధిలో నివసించే ఉప్పలూరు చాంద్‌బాషా, గుల్జార్‌బేగం దంపతులకు ఓ కుమార్తె (కరీమున్నీసా), ముగ్గురు కుమారులు(కరీముల్లా, మహబూబ్‌బాషా, మహ్మద్‌ రఫీ). రఫీ మినహా ఇద్దరు కుమారులు, కుమార్తెకు పెళ్లిళ్లు అయ్యాయి.

కరీముల్లా గతంలో తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. అయితే అతను కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో.. తల్లిదండ్రులు పక్క వీధిలో వేరే కాపురం పెట్టించారు. ఆ సమయంలో కొందరి చెప్పుడు మాటలు విన్న కరీముల్లా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనపై నింద వేయడంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కరీముల్లా మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాడు. గర్భిణి అయిన చెల్లెలు కరీమున్నీసా కూడా పుట్టింటికి వచ్చింది.

భార్యతో విడాకులు ఇప్పించాలని కరీముల్లా అడుగుతుండగా.. తల్లిదండ్రులు సర్ది చెబుతూ వచ్చారు. దీంతో 2021 ఏప్రిల్‌ 25వ తేదీన కరీముల్లా కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజు(26వ తేదీ) తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న తల్లి గుల్జార్‌బేగం, చెల్లి కరీమున్నీసా, తమ్ముడు రఫీని కరీముల్లా రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు.

ఈ ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేయగా.. ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. ముగ్గురిని తానే హత్య చేశానని కరీముల్లా అంగీకరించడం.. నేరం రుజువు కావడంతో జడ్జి జి.రమేశ్‌బాబు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. హైకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు కోర్టు చరిత్రలో ఇది మొదటి ఉరిశిక్ష తీర్పు అని ఏపీపీ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు