Land Dispute: అధికారిపై పెట్రోల్‌ పోసి.. తానూ పోసుకున్న మహిళ

3 Jul, 2021 07:42 IST|Sakshi
అధికారులతో ఓ మహిళ వాగ్వాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా మాచారంలో పోడు వివాదం

మన్ననూర్‌ (అచ్చంపేట): నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ అధికారిపై చెంచు మహిళ పెట్రోల్‌ పోసి, తానూ పోసుకుని నిప్పంటించేందుకు యత్నించగా అక్కడున్నవారు అడ్డుకున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారానికి చెందిన 20 మంది చెంచులు 30 ఏళ్లుగా సమీపంలోని 60 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. నెల క్రితం ఆ భూములు సాగు చేయొద్దని చెంచులకు అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా తిరస్కరించారు.

తాజాగా శుక్రవారం ప్లాంటేషన్‌ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు ఆ భూముల్లో మార్కింగ్‌ వేయడానికి వచ్చారు. దీంతో చెంచు మహిళా రైతులు వాగ్వాదానికి దిగారు. భూముల కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని తెగేసి చెప్పారు. అంతలోనే ఓ మహిళ అటవీశాఖ అధికారిపై పెట్రోల్‌ చల్లి తానూ పోసుకుని అగ్గిపుల్ల గీసేందుకు యత్నించింది. వెంటనే కొందరు లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇది తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడి వెళ్లి మాట్లాడారు. పోడు భూముల విషయాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని, చెంచులను ఇబ్బంది పెట్టవద్దని 15 రోజుల క్రితమే అధికారులకు చెప్పామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు