కిరాతకం: ప్రేమిస్తున్నానని వెంటపడి ఆమెపై..

29 Apr, 2022 07:45 IST|Sakshi

యశవంతపుర: ఐటీ సిటీలో కొంతకాలంగా వినిపించని యాసిడ్‌ దాడి మళ్లీ తెర మీదకు వచ్చింది. సుంకదకట్టలో ఒక యువతిపై దుండగుడు యాసిడ్‌ దాడి చేశాడు. స్థానిక ముత్తూట్‌ ఆఫీసులో ఓ యువతి (23) పని చేస్తోంది. నాగేశ్‌ అనే యువకుడు రోజూ ఆమె వెంటపడి ప్రేమించాలని అడిగేవాడు. గురువారం ఉదయం 8:30 సమయంలో కూడా అదే మాదిరిగా ఆఫీసు వద్దకు వచ్చి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు.  

ప్రేమించనని చెప్పడంతో  నిన్ను ప్రేమించను, నా వెంట పడొద్దు అని ఆమె ఛీ కొట్టడంతో గొడవ జరిగింది. దీంతో దుండగుడు ముందుగానే పథకం ప్రకారం తెచ్చుకున్న సీసాలో నుంచి యాసిడ్‌ను ఆమెపై గుమ్మరించి పరారయ్యాడు. బాధను తట్టుకోలేక యువతి రక్షించాలని కేకలు వేసింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యువతి గొంతు, కాలు సహా శరీరంలో 40 శాతం గాయాలైనట్లు వైద్యుడు కార్తీక్‌ తెలిపారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. కామాక్షిపాళ్య పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.  

కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి  
యాసిడ్‌ దాడిని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఇది ఒక అమానవీయ ఘటన. నిందితునిపై కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులకు సూచించాను, బాధితురాలికి మెరుగైన చికిత్సలను అందిస్తామన్నారు.

అతన్ని వదలొద్దు: యువతి 
తనపై దాడి చేసిన నాగేశ్‌ను వదలవద్దని బాధిత యువతి డిమాండ్‌ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పోలీసులు విచారించారు. అతన్ని మాత్రం వదలద్దు, సరైన శిక్ష పడాలి అని ఆమె అన్నారు. ముత్తూట్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నట్లు తెలిపింది. కాగా, యాసిడ్‌ పోసి పరారైన నిందితుడు నాగేశ్‌ కోర్టు వద్దకు వెళ్లి లాయర్‌ను కలిశాడు. ఆపై అతని ఫోన్‌ స్విచాఫ్‌ అయిందని పోలీసుల విచారణలో బయట పడింది. 

ఇది కూడా చదవండి: ఆటోలో యువతిపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి..

మరిన్ని వార్తలు