రియల్‌ ఎస్టేట్‌ పేరిట కోట్లు గడించిన ఏసీపీ

5 Oct, 2020 12:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం విచారిస్తున్నారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిగింది. నర్సింహారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాకలు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఏసీపీ పదవిని అడ్డుపెట్టుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అక్రమంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీ రిమాండ్‌ నివేదికలో వెల్లడించింది. ఈ కేసులో ఎ2 నుంచి ఎ13 నిందితులంతా ఉద్దేశపూర్వకంగానే ఆయనకు సహకరించారని అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ సర్వే నెంబర్ 64 లోని 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నిందితులు కబ్జా చేసి 2 వేల గజాల భూమిని 490 గజాల చొప్పున విభజించి.. నాలుగు డాక్యుమెంట్లు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు మొదట తండ్రుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. తర్వాత కొడుకుల పేరిట గిఫ్ట్ డీడ్‌గా మార్చారని, గిఫ్ట్‌ డీడ్ నుంచి నర్సింహారెడ్డి భార్య పేరుతో పాటు మరో నలుగురు బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది.

నర్సింహారెడ్డి 2 వేల గజాల భూమిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా తెల్చినట్లు ఏసీబీ పేర్కొంది. అయితే ఈ భూమిపై ఎలాంటి హక్కు లేనప్పటికి నిందితులు ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చినట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు భారీ స్థాయిలో ఏసీపీ బీనామీ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌లో నాలుగు నివాస గృహాలు, అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూములు నర్సింహారెడ్డి బీనామీల పేరిట ఉన్న ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

నర్సింహారెడ్డితో పాటు మరో 13 మందిని నిందితులుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో ఎ1 నిందితుడు ఏసీపీ నర్సింహారెడ్డి, ఎ2-గోపగాని రాజలింగం, ఎ3-గోపగాని సజ్జన్‌ గౌడ్‌, ఎ4- పోరేటి వెంకట్‌రెడ్డి, ఎ5-పోరేటి తిరపతి రెడ్డి, ఎ6- ఎర్ర శంకయ్య, ఎ7- ఎర్ర చంద్రశేఖర్‌, ఎ8- అర్జుల గాలిరెడ్డి, ఎ9-అర్జుల జైపాల్‌రెడ్డి, ఎ10-మధుకర్‌ శ్రీరామ్‌, ఎ11- చంద్రారెడ్డి, ఎ12- బత్తిని రమేష్‌, ఎ13- అలుగువెళ్లి శ్రీనివాస్‌రెడ్డిగా అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుల్లో 11 మందిని అరెస్టు చేశామని మరో ఇద్దరూ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు