నటి చాందినీని మోసం చేసిన కేసులో కొత్త ట్విస్ట్‌..

30 Jun, 2021 08:42 IST|Sakshi

పుళల్‌ జైలుకు మాజీ మంత్రి మణికంఠన్‌

సైదాసేట సబ్‌జైల్లో లగ్జరీ జీవితం బట్టబయలు 

సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ మంత్రి (అన్నాడీఎంకే) మణికంఠన్‌ సౌకర్యవంతమైన జైలు జీవితం భగ్నమైంది. జైళ్లశాఖకు చెందిన విజిలెన్స్‌ అధికారుల సాక్షిగా బండారం బట్టబయలు కావడంతో చెన్నై సైదాపేట సబ్‌ జైలు నుంచి చెన్నై పుళల్‌ సెంట్రల్‌ జైలుకు ఆయన్ని తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అన్నాడీఎంకే ప్రభుత్వ హాయాంలో సమాచార శాఖా మంత్రిగా పనిచేసిన మణికంఠన్‌ను.. పర్యాటకాభివృద్ధి పనుల నిమిత్తం నటి చాందినీ అనేకసార్లు కలిశారు. ఈ రకంగా వాద్దరి మధ్య ఏర్పడిన పరిచయం బలపడింది. తన భార్యతో సరిపడటం లేదని, వైవాహిక జీవితం విఫలమైందని పేర్కొంటూ అతడు చాందినీకి చేరువయ్యాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి చెన్నై అడయారులో ఇల్లుతీసుకుని భార్యభర్తల్లా మెలిగేవారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చినపుడల్లా అబార్షన్‌ చేయించాడు. వివాహం చేసుకొమ్మని ఒత్తిడి చేయడంతో చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో భయపడిపోయిన చాందినీ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాలీని స్వయంగా కలిసి మణికంఠన్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగానే మణికంఠన్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ముందస్తు జామీనుకు దరఖాస్తు చేసుకోగా మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. బెంగళూరులోని ఒక రిసార్టులో దాక్కుని ఉన్న మణికంఠన్‌ను వారం రోజుల క్రితం చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేసి సైదాపేట సబ్‌ జైల్లో పెట్టారు. అయితే అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లు జైళ్లశాఖ ఇంటెలిజెన్స్‌ అధికారులకు సమాచారం వచ్చింది.

దీంతో జైళ్లశాఖ విజిలెన్స్‌ అధికారులు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా సైదాపేట సబ్‌జైలుకెళ్లి తనిఖీలు చేపట్టారు. మాజీ మంత్రి మణికంఠన్‌ రూంలో ఎయిర్‌కూలర్, మెత్తని పరుపు, దిళ్లు, సువాసన వెదజల్లే బాటిళ్లు గుర్తించారు. అంతేగాక చార్జర్‌ సౌకర్యంతో సెల్‌ఫోన్‌ను ఉండటాన్ని గమనించారు. ఈమొత్తం సామగ్రిని స్వాధీనం చేసు కున్న విజిలెన్స్‌ అధికారులు మణికంఠన్‌ను వెంటనే చెన్నై పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. మణికంఠన్‌కు సకల సౌకర్యాలు కల్పించిన జైలు అధికారులపై విచారణకు ఆదేశించారు.  

చదవండి: భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్‌: నటి చాందిని


 

మరిన్ని వార్తలు