ఒక్కగానొక్క కొడుకు మృతి.. తల్లిదండ్రులకు గాయాలు

5 Apr, 2021 11:26 IST|Sakshi
కారు దూసుకొచ్చిన ఇల్లు, మధు మృతదేహం

సాక్షి, బెల్లంపల్లి: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చేదోడు,వాదోడుగా ఉంటాడునుకున్న ఒక్కగానొక్క కొడుకును కబలించింది. ఆ కుటుంబానికి కాలరాత్రిని మిగల్చింది. అతివేగంగా వస్తున్న కారు ఇంట్లోకి దూసుకు రావడంతో కుమారుడు మరణించగా, తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన బెల్లంపల్లిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టూటౌన్‌ ఎస్సై భాస్కర్‌రావు వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మున్సిపల్‌ పరిధి సుభాష్‌నగర్‌బస్తీలో నివాసం ఉంటున్న బరిగెల లింగయ్య తన భార్య రాజవ్వ, కొడుకు మధు(20)తో కలిసి శనివారం ఇంటి ఆరుబయట నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో నెంబర్‌– 2 ఇంక్‌లైన్‌ బస్తీకి చెందిన మంచర్ల రాకేశ్‌ అనే యువకుడు శాంతిఖని బస్తీ వైపు నుంచి తన ఇంటికి కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో వేగంగా వస్తున్న కారు లింగయ్య ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో మధు తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. తల్లి రాజవ్వ తలకు, చేతికి గాయాలయ్యాయి. లింగయ్య కూడా స్వల్పంగా గాయపడ్డాడు. రాజవ్వకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రమాదం అనంతరం నిందితుడు రాకేశ్‌ కారుతో సహా పరారీ అయ్యాడు.


గాయపడిన రాజవ్వ, లింగయ్య

తాగి నడిపాడా?
కాయకష్టం చేసుకుని జీవించే పేద కుటుంబాన్ని కారు ప్రమాదం రూపంలో చిన్నాబిన్నం చేసింది. కారు నడిపిన రాకేశ్‌ మత్తులో ఉండి నడిపాడా లేదా అదుపు తప్పి ఢీకొట్టాడా అన్నది తెలియకుండా పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రాకేశ్‌ అక్కడి నుంచి కారుతో సహా పారిపోవడం మరింత అనుమానాలను కలిగిస్తోంది. నిద్రమత్తులో ఉండగా కారు వచ్చి ఢీకొన్న ఘటనతో కన్న కొడుకు కళ్ల ముందే కన్నుమూయడం ఆ వృద్ధ దంపతులను తీవ్ర వేదనకు గురి చేసింది. కాగా రాకేశ్‌ ఆదివారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. టూటౌన్‌ ఎస్సై భాస్కర్‌రావు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మధు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు