తల్లిని దారుణంగా చంపి.. అంతే కిరాతకంగా హతమై..

13 May, 2022 03:25 IST|Sakshi

సరూర్‌నగర్‌లో తల్లిని చంపిన దత్తపుత్రుడు సాయితేజ హతం 

శ్రీశైలం సమీపంలోని మల్లెలతీర్థం వద్ద అతడిని చంపేసిన స్నేహితులు

మన్ననూర్‌/ సాక్షి, హైదరాబాద్‌: పెంచి పెద్ద చేసిన తల్లిని స్నేహితులతో కలిసి కిరాతకంగా హత్య చేసిన దత్తపుత్రుడు సాయితేజ (27) అంతే కిరాతకంగా హతమయ్యాడు. తల్లిని చంపేందుకు సాయితేజకు సహకరించిన స్నేహితుడే అతడినీ హత్యచేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి.. ముఖమంతా ఛిద్రం చేసి చంపాడు. కానీ భయపడి పోలీసులకు లొంగిపోయాడు. 

పెంచి పెద్ద చేసిన తల్లిని చంపి..
హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి జంగయ్య యాదవ్, భూదేవి (58) దంపతులు.. 1995లో బంధువుల నుంచి నెల రోజుల మగబిడ్డను దత్తత తెచ్చు కున్నారు. సాయితేజ అని పేరు పెట్టి పెంచుకున్నారు. మతిస్థిమితం సరిగా లేని సాయితేజకు స్థానికంగా ఉన్న ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇం ట్లో నగదు, బంగారం ఉన్నాయని తెలుసు కున్న సాయితేజ.. వాటిని తన ప్రేయసికి ఇవ్వాలనుకున్నాడు.

తల్లి అడ్డువస్తుందన్న ఉద్దేశంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడైన డ్రైవర్‌ నర్సింహను సాయం చేయాలని కోరాడు. కొంత డబ్బు కూడా ఇస్తానని చెప్పడంతో నర్సింహ ఒప్పుకున్నాడు. తర్వాత నర్సింహ ఈ విషయాన్ని తన స్నేహితులైన చంపాపేటకు చెందిన వట్టికోటి శివ, చింటు, అంజి, సాయిగౌడ్‌లకు తెలిపాడు. అందరూ కలిసి ఈనెల 6న అర్ధరాత్రి  సాయితేజ ఇంటికి వెళ్లారు. నిద్రలో ఉన్న భూదేవిని చంపి.. 10 లక్షల నగదు, 30 తులాల బంగారంతో పరారయ్యారు.

బయటపెడ్తాడని భయపడి..
ఎత్తుకెళ్లిన నగలు, నగదును అంతా పంచు కున్నారు. కానీ మతిస్థిమితం సరిగా లేని సాయితేజ.. ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడతాడేమోనని శివ, నర్సింహ, ఇతర స్నేహి తులు భయపడ్డారు. సాయితేజను చంపేస్తే సమస్య తీరుతుందని నిర్ణయించు కున్నారు. ఈ నెల 7న మధ్యాహ్నం శ్రీశైలం వెళ్తున్నామ ని, అక్కడ తన ప్రేయసిని కలవచ్చని సాయితేజకు చెప్పారు. అంతా కలిసి బస్సులో శ్రీశైలం వెళ్లారు. ఆ రోజు రాత్రి సత్రంలో గడిపారు. తర్వాతిరోజు ఉదయం దైవ దర్శనం చేసుకొని, గుండు కొట్టించుకున్నారు. రాత్రికి వట్టె్టవారిపల్లికి చేరుకుని నిద్రించారు. ఈనెల 10న ఉదయం అమ్రాబాద్‌ మండల పరిధిలోని మల్లెలతీర్థం జలపాతానికి వెళ్లారు.

ముఖం గుర్తుపట్టకుండా..
మల్లెలతీర్థం ప్రాంతంలో శివ, సాయితేజ మద్యం తాగారు. శివ ఈ క్రమంలో సాయితేజతో గొడవ పెట్టుకుని దాడికి దిగాడు. సాయితేజ కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి చంపాడు. అదే రాయితో ముఖం గుర్తు పట్టకుండా ఛిద్రం చేశాడు. తర్వాత బ్యాగులో రాళ్లునింపి మృతదేహానికి కట్టి.. మల్లెలతీర్థం కింది భాగంలో ఉన్న నీటి గుండంలో పడేశాడు.

మత్తు దిగాక తీవ్ర భయాందోళనకు గురైన శివ.. బస్సులో నేరుగా హైదరాబాద్‌కు వచ్చాడు. సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఉదయం 10:30 గంటలకు అమ్రాబాద్‌ పోలీసులు, అటవీ అధికారుల సహకారంతో మల్లెల తీర్థం జలపాతం వద్దకు చేరుకుని సాయి తేజ మృతదేహాన్ని వెలికితీశారు. శివ వద్ద రూ.1.40 లక్షల నగదు, బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను చెప్పిన వివరాల మేరకు మిగతా నిందితులు నర్సింహా, చింటు, అంజి, సాయిగౌడ్‌లను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 
చదవండి: కల్యాణ మండపంలో నవ వధువు మృతి కేసులో ట్విస్ట్‌

మరిన్ని వార్తలు