ఆ వకీలు నిత్యపెళ్లికొడుకు .. ముచ్చటగా మూడోసారి

6 Jan, 2022 07:38 IST|Sakshi

సాక్షి, మైసూరు (కర్ణాటక): పేరుకు న్యాయవాది, కానీ చేసేది మాత్రం మహిళలకు అన్యాయం. జిల్లాలోని కేఆర్‌ నగరలో సీవీ సునీల్‌ కుమార్‌ అనే న్యాయవాది మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు. శివమొగ్గ సాగర తాలూకాకు చెందిన 36 ఏళ్ల మహిళను మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో పరిచయం చేసుకుని 2020, జూన్‌ 18న పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ. 5 లక్షలను తీసుకున్నాడు. తరచూ వేధిస్తుండడంతో ఆమె కేఆర్‌ నగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

నెలరోజులు జైల్లో ఉండి వచ్చాడు. మైసూరు బాంబూ బజార్‌కు చెందిన మహిళను గత జూలై 27న కేఆర్‌ నగర దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఆమెకు భర్త మొదటిపెళ్లి గురించి తెలిసి నిలదీయగా, నీతోనే కాపురం చేస్తా, రూ. 6 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఆమె ససేమిరా అని పెద్దలతో పంచాయతీ పెట్టించింది.

ఆమెను పుట్టింటికి పంపించేశాడు. బెంగళూరులో షాదీ.కామ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా మరో మహిళను పరిచయం చేసుకుని డిసెంబర్‌ 2న మూడో పెళ్లి చేసుకున్నాడు. కేఆర్‌ నగర ఇంటిలోనే సంపారం పెట్టాడు. ఇది తెలిసి మొదటి ఇద్దరు భార్యలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టారు.    

మరిన్ని వార్తలు