బిట్టు శ్రీను రిమాండ్‌ రిపోర్టు: సంచలన విషయాలు

25 Feb, 2021 18:57 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్‌రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్‌ చేసినట్లు అతడు వెల్లడించాడు.  అడ్వకేట్‌ వామన్‌రావు బతికి ఉంటే తమకు ఎన్నటికైనా సమస్యేనని భావించిన కుంట శీను, తాను హత్యకు పథకం రచించినట్లు పేర్కొన్నాడు. కాగా బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామన్‌రావు గతంలో అనేక కేసులు వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి.

ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం తమ స్వగ్రామం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి రెక్కీ నిర్వహించిన శ్రీను గ్యాంగ్.. ఆయనను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ జనసమ్మర్ధం ఎక్కువగా ఉండటంతో వారి పన్నాగం విఫలమైంది. దీంతో ఈనెల 17వ తేదీన పక్కాగా ప్లాన్‌ చేసిన దుండగులు.. వామన్‌రావు ఒంటరిగా దొరకడంతో ఆయనతో పాటు భార్యను కూడా హతమార్చారు.  వారిద్దరు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత కుంట శీను, బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. 

దీంతో అతడిని మహారాష్ట్రకు పారిపొమ్మని బిట్టు శ్రీను సలహా ఇచ్చాడు. తాను మాత్రం రెండు రోజులు ఇంట్లోనే మకాం వేశాడు. అంతేగాక హత్యకు ముందు వేరే సిమ్ కొనుగోలు చేసిన బిట్టు శ్రీను వాటి ద్వారానే తన భాగస్వాములతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పెద్దపల్లి జంట హత్యల కేసును త్వరిగతిన ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బిట్టు శ్రీనును అతడి ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు.

చదవండి3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి..

మరిన్ని వార్తలు