ఇంటి నుంచి లాక్కెళ్లి.. కమెడియన్‌ దారుణ హత్య

28 Jul, 2021 13:50 IST|Sakshi
దారుణ హత్యకు గురైన అఫ్గనిస్తాన్‌ కమెడియన్‌ నాజర్ మొహమ్మద్(ఫైల్‌ ఫోటో, ఫోటో కర్టెసీ: ఇండియాటుడే)

తాలిబన్లే హత్య చేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రముఖ కమెడియన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ వార్త ప్రపంచాన్ని వణికిస్తుంది. తాలిబన్లే సదరు కమెడియన్‌ను చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సదరు కమెడియన్‌ను ఇంటి నుంచి లాక్కెళ్లి మరి దారుణంగా చంపేశారని తెలిసింది. 

ఆ వివరాలు..  అఫ్గనిస్తాన్‌ కాందహార్‌ ప్రావిన్స్‌లో ఖాషా జ్వాన్‌గా ప్రసిద్ది చెందిన హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ దారుణ హత్య ప్రపంచాన్ని వణికించింది. స్థానిక మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్‌ ఇంట్లో ప్రవేశించి.. గన్నులతో బెదిరించి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాజర్‌ని హత్య చేసినట్లు ప్రచురించారు. నాజర్‌ కమెడియన్‌ కావడానికి ముందు కాందహార్‌ ప్రావిన్స్‌లో పోలీసు అధికారిగా విధులు నిర్వహించేవాడు. 

తాలిబన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ మాత్రం ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఖండించింది. అఫ్గనిస్తాన్‌ భద్రతా దళాలపై తాలిబాన్లు తమ దాడిని తీవ్రతరం చేశారు. ఇప్పటికే దాదాపు 70 శాతం అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దానిలో భాగంగానే ఈ దారుణం చోటు చేసుకుందని భావిస్తున్నారు. కాందహార్‌లో పలు కుటుంబాలు యుద్ధం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల నుంచి పారిపోతున్నాయి. వీరంతా అఫ్గాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

కాందహార్‌ పార్లమెంట్‌ సభ్యుడు సయ్యద్ అహ్మద్ సైలాబ్ మాట్లాడుతూ.. ‘‘ఈద్ వేడుకల తరువాత, తాలిబన్లు కాందహార్‌ ప్రావిన్స్‌లోని అఫ్ఘన్ దళాలపై దాడులను ముమ్మరం చేశారు. భద్రత కోసం పారిపోయిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని’’ అని ఇండియా టుడే టీవీకి తెలిపారు. అంతేకాక కాందహార్‌ సమీపంలోని వలస శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలకు ఆహారం, వైద్య సంరక్షణ అందిస్తున్నామని తెలపారు. ‘‘గ్రామాలను విడిచిపెట్టి కాందహార్‌ వస్తున్న అన్ని కుటుంబాలకు రెండుసార్లు బ్రేక్ ఫాస్ట్, భోజనం అందించాలని మేము నిర్ణయించుకున్నాము’’ అని సయ్యద్‌ అహ్మద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు