శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఆఫ్రికన్‌ అరెస్టు

6 Sep, 2020 05:16 IST|Sakshi

బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వినియోగంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు శనివారం ఈ కేసులో ఆఫ్రికా దేశం సెనెగల్‌ కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. లౌమ్‌ పెప్పర్‌ సాంబా అనే ఇతడు సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నటి రాగిణి ద్వివేదిని సహా మొత్తం ఆరుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి. రాగిణిని శుక్రవారం అరెస్టు చేయగా, జయనగర్‌ ఆర్‌టీవోలో క్లర్క్‌గా పనిచేస్తున్న రవిశంకర్, రియల్టర్‌ రాహుల్‌ షెట్టిలను గురువారం అరెస్టు చేశారు.

ఉన్నతవర్గాల పార్టీలను నిర్వహించే వీరేన్‌ ఖన్నాను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్‌ డీలర్‌ సాంబా... రవిశంకర్‌కు, సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో ఇటీవల బెంగళూరులో కొన్ని అరెస్టులు చేíసినప్పుడు... కన్నడ నటులు, సంగీతకారులతో డ్రగ్‌ డీలర్లకు ఉన్న సంబంధాలు వెలుగు చూశాయి.  నటి రాగిణిని అరెస్టు చేయడం  ప్రకంపనలు రేపింది. కొందరు బడా నేతల కుమారుల ప్రమేయం ఉండటంతో ఈ కేసును నీరుగార్చేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

మరిన్ని వార్తలు