తొమ్మిదేళ్లుగా వారిద్దరూ డేటింగ్‌.. చివరకు శ్మశానంలో

3 Aug, 2021 08:45 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాము, దుర్గ

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

తొమ్మిదేళ్లుగా సహజీవనం

వివాహేతర సంబంధంలో పొరపొచ్చాలు

మనస్తాపంతో పురుగు మందు తాగిన వైనం

నిడదవోలు: తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్న వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తనువు చాలించాలని నిర్ణయించుకుని వేర్వేరు ప్రదేశాల్లో ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. నిడదవోలు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు కూరగాయల మార్కెట్‌ సమీపంలో నివాసముంటున్న గూటం దుర్గ అనే యువతితో రాజానగరం సమీపంలోని కలవచర్ల గ్రామానికి చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ దాసోహం రాము సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే రాముకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

దుర్గ సొంతూరు ఉండ్రాజవరం మండలం వడ్డూరు కాగా తొమ్మిదేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి నిడదవోలు చర్ల సుశీల వృద్ధాశ్రమంలో చేరింది. ఆ సమయంలో రాముతో పరిచయమై వివాహేతర సంబంధం బలపడింది. ఈ క్రమంలో వీరికి ఓ పాప పుట్టగా పంగిడిలో ఉంటున్న బంధువులకు ఇచ్చేశారు. అనంతరం దుర్గ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లింది. అక్కడ కొంతకాలం పనిచేసి నిడదవోలు వచ్చి కూరగాయల మార్కెట్‌ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమె దుబాయి నుంచి వచ్చిన తర్వాత కూడా వీరి మధ్య సంబంధం కొనసాగింది. దుర్గ సంపాదించిన సొమ్ముతో రాము అంబులెన్స్‌ కూడా కొన్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల వీరి మధ్య గొడవలు పెరగడంతో సోమవారం ఆత్మహత్య చేసుకుంటానని రాము ఆమెను బెదిరించాడు. పట్టణంలోని శ్మశానవాటికలో మద్యంలో పురుగు మందు కలిపి తాగాడు. అక్కడి నుంచి బైక్‌పై వచ్చి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓవర్‌ బ్రిడ్జి వద్ద దుర్గకు విషయం చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన దుర్గ అతడి బైక్‌లో ఉన్న పురుగు మందు సీసా తీసి తానూ తాగింది. సమీపంలో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించి వారిద్దరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వీరిద్దరినీ ఉన్నత వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కేఏ స్వామి, పట్టణ ఎస్సై పి.నాగరాజు వారి నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు