వ్యవసాయాధికారి బాగోతం.. ముడుపుల కోసం ఏకంగా వాట్సాప్‌ గ్రూప్‌..

10 Aug, 2021 17:30 IST|Sakshi
వ్యవసాయాధికారి ఎన్‌ఎంసీ.చటర్జీ

సాక్షి, చండ్రుగొండ (ఖమ్మం): షాపుల్లో తనిఖీచేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేసిన మండల వ్యవసాయాధికారి(ఏఓ) వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. చండ్రు గొండలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఫర్టిలైజర్, పెస్టిసైడ్‌ షాపుల్లో తనిఖీచేయకుండా ఉండేందుకు ఏఓ ఎన్‌ఎంసీ.చటర్జీ ప్రతీ షాపు నుంచి రూ.15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ప్రతి నెల లంచం కోసం​ ఒక వాట్సప్‌ గ్రూప్‌నే ఏర్పాటు చేశాడు.  దీంతో డీలర్లు గోదా సత్యం,ఎర్రం సీతారాములు, చెవుల చందర్‌రావు, నన్నక వెంకటరామయ్య, ముఖేష్, మచ్చా కుమార్‌ గతనెల 30వ తేదీన ఏసీబీని ఆశ్రయించారు.

ఈ మేరకు విచారించిన అధికారులు వాస్తవవమేనని నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల సూచన మేరకు డీలర్లు గోదా సత్యం, ఎర్రం సీతారాములు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో ఏఓ చటర్జీకి రూ.90 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకు న్నారు. కాగా, ఏఓ చటర్జీ స్థానికంగా తనకు తెలిసిన వ్యక్తితో పురుగు మందులు, విత్తనాల షాపు పెట్టించి రైతులందరినీ అదే షాపులో కొనాలని సూచిస్తన్నాడనే ఆరోపణలున్నాయి. 

ఏఓ నివాసంలో సోదాలు 
చండ్రుగొండ ఏఓ చటర్జీ స్వగ్రామమైన అశ్వారావుపేటలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఖమ్మం ఏసీబీ ఇ¯న్‌స్పెక్టర్‌ రఘుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి పలు డాక్యుమెంట్లు, బంగారు అభరణాలు సీజ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు