దారుణం: తల్లిదండ్రులు కోల్పోయిన చెల్లెలిపై మూడేళ్లుగా..

19 Jun, 2021 18:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌: అభంశుభం తెలియని అమాయక చిన్నారులపై అంతకంతకు పెరుగుతున్న నేరాలు ఆందోళనే కాదు ఆవేదన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరోధించేందుకు పాలకులు తీసుకుంటున్న చర్యలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయి బయటికెళ్తే ఏ ఆపద ముంచుకొస్తుందనని తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల కాలంలో పరాయివాళ్ల నుంచే కాక మన అనకున్న సొంతవారి నుంచే ఆపదలు పుట్టుకొస్తున్నాయి. వావి వరుసలు, మంచి మర్యాదలు మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు అండగా నిలవాల్సిన సోదరుడే సొంత చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివాసముంటోంది. ఆమె తండ్రి అనారోగ్యంతో 14 ఏళ్ల క్రితమే మరణించగా.. ఇటీవల తల్లి సైతం ప్రాణాలు విడిచింది. దీంతో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్‌ బాలికను ఆమె పెద్ద అన్నయ్య(26) మకార్బాలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. తనకు సంరక్షకులు ఎవరూ లేకపోడంతో బాలిక అతని ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన సోదరుడు సొంత చెల్లెలిపై మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పుడుతూ వచ్చాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. 

అయితే గత మూడు నెలలకు మైనర్‌కు నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన వదిన తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లకు చూపించింది. అక్కడ పరీక్షల అనంతరం బాలిక గర్భవతి అని తేలింది. దీంతో ఈ విషయంపై బుధవారం సర్కేజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2019 జనవరి 29 నుంచి నుంచి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా అతని భార్య పడుకున్న సమయంలో సోదరుడు అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: ఆరో పెళ్లికి సిద్ధమైన బాబా.. ఐదో భార్య ఫిర్యాదుతో
టీవీ చూసేందుకు రమ్మని పిలిచి.. బాలికపై దారుణం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు