ఉద్యోగాల పేరిట మోసం.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి

14 Nov, 2021 08:29 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సరోజ, ఆమె భర్త అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. వివరాలు.. నామక్కల్‌ జిల్లా రాశీపురానికి చెందిన అన్నాడీఎంకే నేత సరోజ గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార శాఖామంత్రిగా పనిచేశారు. పౌష్టికాహార విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.70 లక్షల వరకు తీసుకుని మోసగించినట్లు ఆమె బంధువు గుణశీలన్‌ పోలీసులకు కొన్నినెలల క్రితం ఫిర్యాదు చేశాడు.

దీంతో మాజీమంత్రి సరోజ, ఆమె భర్త లోకరంజన్‌ తదితరులపై నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సరోజ, లోకరంజన్‌ నామక్కల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ వేశారు. దీనిపై ఈనెల 15వ తేదీన మళ్లీ విచారణ చేపట్టనున్నారు. కాగా ముందస్తు బెయిల్‌ పొందడంలో జాప్యం చోటుచేసుకోవడంతో అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకే సరోజ, లోకరంజన్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి పిటిషనర్‌ గుణశీలన్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ, పౌష్టికాహారశాఖ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాజీ మంత్రి సరోజ చెప్పడంతో తాను, భార్య పలువురి వద్ద నుంచి రూ. కోటి వరకూ వసూలు చేసి అందజేశామని అన్నారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలో కొలువులు కల్పించకపోవడంతో పోలీసుకు ఫిర్యాదు చేశామన్నారు.

మరో రెండురోజుల్లో (15వ తేదీన) కేసు విచారణకు వస్తుండగా సరోజ, లోకరంజన్, వారి కుటుంబ సభ్యులు కలసి ఎక్కడికో వెళ్లిపోయారు. పోలీసులు స్పందిస్తూ.. మాజీ మంత్రి సరోజ, ఆమె భర్తపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ నిమిత్తం వారింటికి వెళ్లగా లేరని, కోర్టులో వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ముగిసిన తరువాత చర్యలు తీసుకుంటామ్నారు.  

రాజేంద్ర బాలాజీ పై ఫిర్యాదు 
తిరువొత్తియూరు: ఆవిన్‌ పాల సంస్థలో ఉద్యోగం తీసిస్తామని మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ స్నేహితుడు, వెంబకోటై యూనియన్‌ అన్నాడీఎంకె కార్యదర్శి అయిన విజయ నల్లతంబి రూ.30 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఫిర్యాదులందాయి. కానీ తాను పలువురి వద్ద తీసిచ్చిన రూ.3 కోట్లు నగదును రాజేంద్ర బాలాజీ తిరిగి ఇవ్వలేదని విజయ నల్లతంబి విరుదునగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాలు.. విరుదునగర్‌ జిల్లా సాత్తూరు వెంబకోటై రోడ్డుకు చెందిన రవీంద్రన్‌ (49). ఇతని సహోదరి కుమారుడికి విరుదునగర్‌ ఆవిన్‌ సంస్థలో మేనేజర్‌ ఉద్యోగం కోసం వెంబకోటై అన్నాడీఎంకే యూనియన్‌ కార్యదర్శి విజయ నల్లతంబికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు తెలిసింది. కానీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఎస్పీ మనోహర్‌ వద్ద ఆగస్టు 28న ఫిర్యాదు చేశాడు.

రవీంద్రన్‌ విజయ నల్లతంబిల వద్ద 2021 సెప్టెంబర్‌ 25న ఇన్‌స్పెక్టర్‌ గణేష్‌ దాసు విచారణ చేశారు. ఈక్రమంలో తాను పలువురు వద్ద తీసుకొచ్చిన రూ.3 కోట్ల నగదును మాజీమంత్రి రాజేంద్రన్‌ బాలాజీ తిరిగి ఇవ్వలేదని నల్లతంబి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

మరిన్ని వార్తలు