‘సెబ్‌’ శభాష్‌.. రూ. 30 కోట్ల పొరుగు మద్యం పట్టివేత!

11 Dec, 2021 08:52 IST|Sakshi
సెబ్‌ తనిఖీల్లో పట్టుబడిన మద్యం (ఫైల్‌)

అక్రమ మద్యంపై ఉక్కుపాదం ఇప్పటి వరకు 16,346 కేసులు నమోదు 

రూ. 30 కోట్ల పొరుగు మద్యం పట్టివేత 

నిల్వలతో సెబ్‌ స్టేషన్లు ఫుల్‌

కర్నూలు: అక్రమ మద్యంపై సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు సారా, మద్యానికి సంబంధించి 16,346 కేసులు నమోదు చేశారు. సుమారు 1,100 మందిని అరెస్ట్‌ చేసి కటకటాలకు పంపారు. జిల్లాలో 14 సెబ్‌ స్టేషన్లు, 86 సివిల్‌ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల విలువ చేసే 1.70 లక్షల లీటర్ల పొరుగు రాష్ట్రాల మద్యం, 1147 లీటర్ల బీరు పట్టుబడింది. 

నిరంతర తనిఖీలు.. 
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో 7 అంతర్‌రాష్ట్ర, 10 జిల్లా సరిహద్దు చెక్‌ పోస్టులున్నాయి. వీటిలో సెబ్‌ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పండ్లు, కూరగాయలు, పాలు రవాణా మాటున పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి భారీగా మద్యం తరలివస్తోంది. కొందరు ఇదే వృత్తిగా మార్చుకుని తనిఖీ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చేందుకు పలు అడ్డదారులున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై, కాలినడకన నెత్తిన పెట్టుకుని పొరుగు మద్యాన్ని జిల్లాలోకి తీసుకొస్తున్నారు. సెబ్‌ పోలీసులు నిరంతరం నిఘా ఉంచడంతో భారీగా మద్యం పట్టుపడుతోంది. 

గుట్టలు గుట్టలుగా నిల్వలు  
పట్టుబడిన మద్యం ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గదులు లేవు. దీంతో కర్నూలు సెబ్‌ స్టేషన్‌ ఆవరణలోని పాడుబడిన రెండు గోదాముల్లో ఉంచారు. సీఐ కార్యాలయంలో కూడా గుట్టలుగా నిల్వలు పేరుకుపోయాయి. గోడౌన్లలో నిల్వచేసిన మద్యం బాక్సులు వర్షానికి తడిసి సీసాలు పగిలిపోతున్నాయి. దీంతో వాటిని భద్రపరిచేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా 815 కిలోల గంజాయి, 38 లక్షల గుట్కా ప్యాకెట్లు, నల్లబెల్లం, కల్లు తదితర వాటిని కూడా సీజ్‌ చేసి స్టేషన్‌ గదుల్లోనే భద్రపరిచారు. పట్టుబడిన మద్యం బ్రాండ్లలో ఒక్కొక్క దాన్ని పరీక్షలు చేయించి కెమికల్‌ రిపోర్టు తెప్పించారు. ఇవి వర్షానికి తడుస్తుండడంతో ప్రమాదకర మద్యంగా మారిపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.  

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూపులు  
వాహన తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన మద్యం పట్టుబడితే డిపోలకు అప్పగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పొరుగు రాష్ట్రాల మద్యం డిపోలకు అప్పగించాలా, లేక ధ్వంసం చేయాలా అన్న దానిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. అక్రమ రవాణాపై జిల్లా వ్యాప్తంగా సెబ్, సివిల్‌ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్నూలు సెబ్‌ స్టేషన్‌తో పాటు కర్నూలు అర్బన్‌ తాలూకా(సివిల్‌) పోలీసుస్టేషన్‌లో భారీగా మద్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన సుమారు 2 వేలకు పైగా వాహనాలు పడి ఉన్నాయి. వీటిని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నప్పటికీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. యజమానులకు నోటీసులు జారీ చేయడంలో ఆలస్యం కావడంతో పాటు వారి నుంచి సమాధానం కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో తనిఖీల్లో పట్టుబడిన పొరుగు రాష్ట్రాల మద్యంతో సెబ్‌ స్టేషన్లు, కొన్ని సివిల్‌ పోలీసు స్టేషన్లు నిండిపోయాయి. ఇకపై పట్టుబడిన మద్యం, సారా నిల్వలను ఎక్కడ భద్రపరచాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

సెబ్‌ ఏర్పడినప్పటి నుంచి  పనితీరు ఇదీ..   
►మద్యం, సారా కేసులు : 16,346 
►పట్టుబడిన మద్యం : 1.70 లక్షల లీటర్లు 
►పట్టుబడిన బీర్లు : 1147 లీటర్లు  
►స్వాధీనం చేసుకున్న గంజాయి : 815 కిలోలు 
►సీజ్‌ చేసిన గుట్కా ప్యాకెట్లు : 38 లక్షలు

ఉత్తర్వులు రావాల్సి ఉంది 
తనిఖీల్లో ఏపీకి సంబంధించిన మద్యం పట్టుబడితే డిపోలకు అప్పగించాలని మాత్రమే ప్రభుత్వం ఆదేశించింది. అలాగే పట్టుబడిన సారా సబ్‌డివిజన్ల వారీగా ఇటీవలనే ధ్వంసం చేశాం. పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన మద్యం డిపోలకు అప్పగించాలా..ధ్వంసం చేయాలా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.     – తుహీన్‌ సిన్హా, సెబ్‌ జేడీ   

చదవండి: సముద్రంపై తేలుతున్న ప్యాక్‌.. విప్పి చూస్తే 7 కోట్ల విలువైన..!!

మరిన్ని వార్తలు