రియల్టర్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ?

1 Dec, 2021 08:44 IST|Sakshi
హత్యకు గురైన రియల్టర్‌ విజయ భాస్కర్‌రెడ్డి ,  నిందితుడు నరేందర్‌ రెడ్డి 

నాటు తుపాకీతో హతమార్చాడు

 వ్యాపార లావాదేవీలే విజయ్‌భాస్కర్‌ రెడ్డి హత్యకు కారణం

నాటు తుపాకీతో కాల్చిన నరేందర్‌రెడ్డి

ఏడాది క్రితమే తుపాకీ కొనుగోలు

పోలీసుల అదుపులో నిందితుడు !

సాక్షి, అల్వాల్, రసూల్‌పుర: హైదరాబద్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కబేళా ఖాళీ స్థలంలో శవమై కనిపించిన రియల్టర్‌ తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.  

ఆర్థిక లావాదేవీలు 
టెంపుల్‌ అల్వాల్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన తోట విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికి వారుగా చేసుకునే వారు. అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు నడుస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్‌ వాటి నుంచి బయటపడటానికి, తనకు రావాల్సిన కమీషన్‌ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకీని ఖరీదు చేసిన నరేందర్‌ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆది వారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. 
చదవండి: అమ్మ లొంగలేదని అమ్మాయిని బలిగొన్న కామాంధుడు

పథకం ప్రకారం.. 
సోమవారం ఉదయం తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం నగదుతో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్‌భాస్కర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తరవాత శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకువస్తానంటూ ఇంట్లో చెప్పాడు. కొద్ది దూరంలో నివసించే నరేందర్‌ను తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్‌రెడ్డి పథకం ప్రకారం విజయ్‌భాస్కర్‌రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్‌ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తలలోకి కాల్చాడు.

పుర్రెను చీల్చుకుంటూ దూసుకుపోయిన తూటా లోపలే ఉండిపోయింది. దీంతో ఆయన ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. భాస్కర్‌రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న నరేందర్‌ అక్కడ నుంచి నగదును తీసుకుని పారిపోయాడు. కారులో రక్తం మడుగులో ఉన్న విజయ్‌భాస్కర్‌ను సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు.  

తుపాకీ ఎక్కడ? 
రంగంలోకి దిగిన పోలీసులు నరేందర్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడు నాటు తుపాకీని రహస్యంగా దాచినట్లు తేలడంతో దాని కోసం గాలిస్తున్నారు. మరోపక్క ఇతడికి ఎవరైనా సహకరించారా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. బుధవారం నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. విజయ్‌భాస్కర్‌రెడ్డి మృతితో శ్రీనివాసనగర్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఈయనకు భ్యార్య, కుమారుడు, కుమర్తె ఉన్నారు. కుమారుడు ఇటీవల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడని సన్నిహితులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు