చంపి.. బొందపెట్టారు: అమెజాన్‌ అడవుల్లో వీడిన మిస్టరీ.. బొల్సోనారో బలుపు వ్యాఖ్యలు

16 Jun, 2022 16:14 IST|Sakshi

ప్రముఖ బ్రిటిష్‌ జర్నలిస్ట్ డామ్‌ ఫిలిప్స్‌, ఆయన కూడా వెళ్లిన ఓ ఆదివాసి ఉద్యమకారుడు‌.. అమెజాన్‌ అడవుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్లను చంపి ముక్కలుగా నరకడమే కాదు.. విడి భాగాలు దొరక్కుండా పూడ్చిపెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. అమెజాన్‌ అడవుల్లో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, అక్కడ జరుగుతున్న ఇల్లీగల్‌ వ్యవహారాలను బయటపెడతారనే భయంతోనే ఈ జంట హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

బ్రెజిల్‌ అమెజాన్‌ అడవుల్లో తాజాగా ఘోరం జరిగింది. ఇల్లీగల్‌ మైనింగ్‌, అక్రమ చేపల వేట, డ్రగ్స్‌ రవాణా నేరాలకు నెలవైన ప్రాంతంలో ప్రముఖ బ్రిటిష్‌ జర్నలిస్ట్‌ డామ్‌ ఫిలిప్స్‌, ఆయన వెంట ఉన్న ఆదిమ తెగకు చెందిన బ్రూనో పెరెయిరా(అమెజాన్‌ ఆదిమ తెగల హక్కుల పరిరక్షకుడు) హత్యకు గురయ్యారు.  వీళ్లిద్దరినీ అక్కడ ఇల్లీగల్‌ వ్యవహారాలు(చేపల వేట, డ్రగ్స్‌ మాఫియా) నడిపించే ఒలీవెరియా బ్రదర్స్‌ హతమార్చినట్లు తేలింది. 

తొలుత ఈ కేసులో.. అమరిల్డో ఒలీవెరియాను బ్రెజిల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని ద్వారా అమెజోనాస్‌లోని ఇటాక్యూవాయి నదీ తీరం వెంట పాతిపెట్టిన మృతదేహాల శకలాలను అతికష్టం మీద వెలికి తీశారు బ్రెజిల్‌ పోలీసులు. ఇందుకోసం నాలుగు రోజులపాటు గాలింపు చర్యలు సాగాయి. ఇక ఈ జంట హత్యల్లో ఒలీవెరియా సోదరుడు ఒసెనే ఒలీవెరియాను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బ్రెజిల్‌ అమెజాన్‌ అడవుల్లో జరుగుతున్న అక్రమ దందాలను బయటపెట్టే ఉద్దేశంతో.. ఫిలిప్స్‌,పెరెయిరా విచారణ కోసం వెళ్లారు. అయితే జూన్‌ 5వ తేదీ నుంచి వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫిలిప్స్‌ భార్య అలెస్సాండ్రా సంపాయో న్యాయం కోసం పోరాటానికి దిగారు. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మద్ధతు పెరిగింది. మిస్టరీని త్వరగా చేధించాలని పోలీసులపై ఒత్తిడి పెరిగింది.  ఈ క్రమంలోనే.. ఆ ప్రాంతంలో ఇల్లీగల్‌ వ్యవహారాలకు కారణమయ్యే అమరిల్దోను అరెస్ట్‌ చేశారు. ఆపై అతన్ని, అతని సోదరుడైన ఒసెనేను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఇద్దరూ కూడా మత్స్యకారులనే తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఫిలిప్స్‌(57) గార్డియన్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ పత్రికలకు పని చేశారు. ఇక పెరెయిరా(41) ఆదిమ తెగల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమవేత్త, న్యాయవాది. బ్రెజిల్‌ ఆదిమ తెగల వ్యవహారాల సంస్థలో పని చేస్తున్న ఆయన.. సెలవులు తీసుకుని మరీ ఫిలిప్స్‌ వెంట అమెజాన్‌ అడువుల్లోకి వెళ్లారు. 

బోల్సోనారో బలుపు వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. ఈ జంట హత్యల మీద బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘‘ఆయన(ఫిలిప్స్‌ను ఉద్దేశించి)కు వేరే పని లేదేమో. ఏం దొరకనట్లు.. పర్యావరణ సంబంధిత కథనాలు, ఇల్లీగల్‌ మాఫియాల మీద స్టోరీలు రాశారు. యూరప్‌వాడు కదా! బహుశా అందుకే అక్కడి వాళ్లకు నచ్చక.. ఆయన్ని చంపి ఉంటారంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ప్రభుత్వం పని అడవుల్ని పరిరక్షించడం.. అక్కడి క్రిమినల్స్‌ను నియంత్రించడం కాదు అంటూ వ్యాఖ్యానించారాయన.

‘‘ఒకవేళ వాళ్లిద్దరినీ చంపి ఉంటే.. కచ్చితంగా నీళ్లలో పడేసి ఉంటారు. ఆ నీళ్లలో పిరానా(రాక్షస చేపలు)లు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు’’ అంటూ తిక్క తిక్క ప్రసంగంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు బోల్సోనారో.  అమెజాన్‌ మీద పుస్తకం రాస్తున్న తరుణంలోనే ఫిలిప్స్ ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. ఇక పరెయిరాకు గతంలోనూ ఇల్లీగల్‌ మాఫియాల నుంచి బెదిరింపులు వచ్చాయి. అమెజాన్‌ అడవుల్లో ఇల్లీగల్‌ దందాలు, కార్యకలాపాలు జరుగుతున్నా.. ఆయా దేశాల ప్రభుత్వాలు ముఖ్యంగా బ్రెజిల్‌ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ వస్తోంది.

మరిన్ని వార్తలు