కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి

4 Jul, 2022 06:23 IST|Sakshi

ఉమేశ్‌ అంత్యక్రియల్లోనూ ఇర్ఫాన్‌ పాల్గొన్నట్లు వెల్లడి

అమరావతి(మహారాష్ట్ర): అమరావతికి చెందిన కెమిస్ట్‌ ఉమేశ్‌ కోల్హె హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌(35)కు కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. శనివారం నాగపూర్‌లో అరెస్ట్‌ చేసిన ఇర్ఫాన్‌ఖాన్‌ను ఆదివారం ఎన్‌ఐఏ బృందం కొత్వాలీ పోలీస్‌ స్టేషన్‌లో ప్రశ్నించింది. అనంతరం అతడిని డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ కోర్టులో హాజరుపరచగా 7వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు ఉమేశ్‌ కోల్హెను దుండగులు జూన్‌ జూన్‌ 21వ తేదీన హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ ఏడో నిందితుడు. అమరావతికి చెందిన ఉమేశ్‌కు వెటరినరీ మందుల దుకాణం ఉంది. ఈయన వెటరినరీ వైద్యులతో కూడిన వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఇర్ఫాన్‌ ఖాన్‌ సభ్యుడు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇర్ఫాన్‌ రాహ్‌బర్‌ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. వాట్సాప్‌ గ్రూప్‌లో నుపుర్‌ శర్మకు అనుకూలంగా ఉమేశ్‌ పెట్టిన పోస్టుపై ఇర్ఫాన్‌ ఆగ్రహంతో ఉన్నాడు.

ఇతడే ఉమేశ్‌ హత్యకు పథకం వేసి, కొందరికి బాధ్యతలు అప్పగించాడు. వీరిలో నలుగురు ఇతడి స్వచ్ఛంద సంస్థకు చెందిన వారే. ఉమేశ్‌ హత్య అనంతరం అంత్యక్రియల్లో కూడా ఇర్ఫాన్‌ పాల్గొన్నాడు. కన్హయ్యాలాల్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఏకే ఈ కేసును కూడా అప్పగిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారంగా అందాల్సి ఉందని అమరావతి పోలీస్‌ కమిషనర్‌ ఆర్తి సింగ్‌ చెప్పారు.  

దర్జీ హత్యపై భారీ నిరసన ర్యాలీ
ఉదయ్‌పూర్‌లో కన్హయ్యాలాల్‌ అనే దర్జీ దారుణ హత్యకు నిరసనగా జైపూర్‌లో ఆదివారం భారీ ర్యాలీ జరిగింది.

మరిన్ని వార్తలు