గణేష్‌ నిమజ్జనంలో విషాదం: చావును ఏరికోరి తెచ్చుకోవడం అంటే ఇదే!

23 Sep, 2023 18:53 IST|Sakshi

సాక్షి, అన్నమయ్య: రాజంపేటలో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. విన్యాసాలు చేయబోయి ఓ వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అప్పటిదాకా సంతోషంగా గంతులేసిన వ్యక్తి.. అరక్షణంలో రక్తపు మడుగులో పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయయారు. 

రాజంపేట పట్టణంలో శనివారం కిరణ్‌ అనే వ్యక్తి గణేష్‌ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఫుల్‌గా తాగేసి ఉన్న కిరణ్‌.. రకరకాల విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో విగ్రహం తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ బంపర్‌పై నుంచి దూకి విన్యాసం చేయాలనుకున్నాడు. అయితే.. 

ఆ ఊపులో తల సరాసరిగా రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్నవాళ్లు  కడప ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో నరాలు దెబ్బ తిన్నాయని.. ఆపరేషన్‌ అవసరమని, పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మద్యం మత్తులో వినోదానికి పోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ యువకుడు.

మరిన్ని వార్తలు