దాడి చేసొస్తే.. దాచేస్తాం!.. పరిటాల కుటుంబం తీరుపై సర్వత్రా విమర్శలు

4 May, 2022 15:00 IST|Sakshi

అట్రాసిటీ కేసు నిందితులకు పరిటాల సునీత చిన్నాన్న ఎల్‌.నారాయణ చౌదరి ఆశ్రయం

చాలా రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్న వైనం

గతంలో హత్య కేసు నిందితులకు ఆశ్రయమిచ్చిన పరిటాల శ్రీరామ్‌

సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): ఎవరైనా తప్పు చేస్తే మందలించాలి. నేరం చేస్తే పోలీసులకు అప్పగించాలి. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా చూడాలి. కానీ పరిటాల కుటుంబం మాత్రం తప్పు చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కందుకూరు శివారెడ్డి హత్య కేసు నిందితులకు పరిటాల శ్రీరామ్‌ ఆశ్రయం ఇవ్వగా..తాజాగా గిరిజన యువకుడిపై హత్యాయత్నం కేసులోని నిందితులకు పరిటాల సునీత చిన్నాన్న ఎల్‌.నారాయణ చౌదరి తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో పరిటాల కుటుంబం తీరుపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: కుప్పంలో టీడీపీ నేతల ‘కరెంట్‌ డ్రామా’

నిందితులను ఇంట్లో ఉంచుకున్న సునీత చిన్నాన్న 
రామగిరి మండలం సుద్దకుంటపల్లిలో రఘు నాయక్‌ అనే గిరిజన యువకుడిపై గత నెల నాల్గో తేదీన అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు బ్రహ్మ, శరత్‌ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో నిందితులిద్దరూ గ్రామం నుంచి వెళ్లిపోయారు.

వారికి మాజీ మంత్రి పరిటాల సునీత చిన్నాన్న ఎల్‌.నారాయణ చౌదరి, ఆయన కుమారుడు ఎల్‌.నరేంద్ర చౌదరి ఆశ్రయం కల్పించారు. అనంతపురం నగరంలోని తమ నివాసంలోనే వారికి ఆశ్రయమిచ్చారు. సంఘటన గత నెల నాల్గో తేదీ జరగ్గా... ఎట్టకేలకు 29వ తేదీన ఎల్‌.నారాయణ చౌదరి నివాసంలో నిందితులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఆశ్రయమిచ్చినందుకు  ఎల్‌.నారాయణ చౌదరి (ఏ–11), ఆయన కుమారుడు ఎల్‌.నరేంద్ర చౌదరి (ఏ–12)పైనా రామగిరి పోలీసులు సెక్షన్‌ 212 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నాడు హత్య కేసు నిందితులకు ఆశ్రయం
గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు అనంతపురం రూరల్‌ మండలం కందుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ట్యాంకర్‌తో గ్రామంలో నీరు ఉచితంగా అందిస్తూ సేవ చేస్తున్న శివారెడ్డిని నిష్కారణంగా చంపారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి గ్రామంలో ప్రజల మద్దతు తగ్గుతుందనే భావనతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా శివారెడ్డిని అంతమొందించారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సాకే బాలకృష్ణ  ప్రధాన నిందితుడు. నిందితులు పోలీసులకు చిక్కే వరకు పరిటాల శ్రీరామ్‌ ఇంట్లోనే ఆశ్రయం కలి్పంచారు. కేసులో అరెస్టయ్యి బెయిల్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పరిటాల శ్రీరామ్‌ పంచనే వారు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. శ్రీరామ్‌ ప్రధాన అనుచరుల్లో బాలకృష్ణ ఒకరు కావడం గమనార్హం. ఆయన సమకూర్చిన వాహనంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు కందుకూరు గ్రామానికి నిందితులు వెళ్లగా.. జనం మూకుమ్మడిగా తరిమికొట్టారు. ఓటు సైతం వేయనీయలేదు.    

భయాందోళనలు సృష్టించేందుకేనా? 
గత సార్వత్రిక ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గ ఓటర్లు పరిటాల కుటుంబాన్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. నియోజకవర్గంలో తిరిగి పట్టు సంపాదించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులకు ఆశ్రయం కల్పిస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.     

మరిన్ని వార్తలు