దంత వైద్యుడి కిడ్నాప్‌.. భగ్నం చేసిన పోలీసులు

29 Oct, 2020 03:36 IST|Sakshi
కారులో బందీగా ఉన్న డాక్టర్‌ హుస్సేన్‌

కారులో బెంగళూరు తరలిస్తుండగా కాపాడిన అనంతపురం పోలీసులు

ఒకరి అరెస్ట్, ముగ్గురు కిడ్నాపర్ల పరార్‌

రూ.10 కోట్ల కోసం డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసిన దుండగులు 

పోలీసుల్ని అభినందించిన డీజీపీ సవాంగ్‌

సాక్షి, అమరావతి/రాప్తాడు (అనంతపురం జిల్లా): హైదరాబాద్‌కు చెందిన దంత వైద్యుడిని కిడ్నాప్‌ చేసి బెంగళూరుకు తరలిస్తుండగా అనంతపురం పోలీసులు భగ్నం చేశారు. వైద్యుడిని రక్షించి ఓ కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారయ్యారు. బుధవారం వేకువజామున సినీ ఫక్కీలో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీలోని హిమాయత్‌ నగర్‌ దర్గా సమీపంలో క్లినిక్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ బెహజాట్‌ హుస్సేన్‌ను బురఖాలు ధరించిన వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం కిడ్నాప్‌ చేశారు. అతడి కుటుంబీకులకు ఫోన్‌ చేసి రూ.10 కోట్లు డిమాండ్‌ చేయగా.. వారు హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు అనంత వైపు వెళ్తున్నట్టు నిర్ధారించుకున్నారు. కర్నూలు, అనంతపురం ఎస్పీలకు సమాచారం అందించి కిడ్నాప్‌ను ఛేదించాల్సిందిగా కోరారు.

కిడ్నాపర్ల ఆట కట్టించిన ‘అనంత’ పోలీసులు
రంగంలోకి దిగిన అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు మంగళవారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలకు ఆదేశించారు. బుధవారం వేకువజామున అనంతపురంలోని తపోవనం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా.. కిడ్నాపర్లు అతి వేగంగా బెంగళూరు వైపు పోనిచ్చారు. దీంతో అక్కడి పోలీసులు రాప్తాడు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇటుకులపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్, రాప్తాడు ఎస్‌ఐ పీవై ఆంజనేయులు రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి వద్ద డాల్ఫిన్‌ హోటల్‌ సమీపంలో జాతీయ రహదారి దగ్గర కాపుగాశారు. దీనిని గమనించిన కిడ్నాపర్లు కుడి వైపు మలుపు తీసుకుని కారును బుక్కచెర్ల వైపునకు మళ్లించారు. వెంటనే పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించారు.

ఎస్‌ఐ ఆంజనేయులు అయ్యవారిపల్లి, బుక్కచెర్ల, జి.కొత్తపల్లి, గాండ్లపర్తి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. బుక్కచెర్ల గ్రామంలోకి కారు రాకుండా గ్రామస్తులు రాళ్లు, ముళ్ల కంపల్ని అడ్డుగా పెట్టగా.. కిడ్నాపర్లకు దారి తెలియక బుక్కచెర్ల చెరువు వైపు వెళ్లారు. అక్కడి నుంచి ముందుకు దారి లేకపోవడంతో కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కిడ్నాపర్లను వెంబడిస్తూ వచ్చిన పోలీసులు వారిలో ఒకర్ని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన నలుగురు పరారయ్యారు. పోలీసులు కారు దగ్గరికి వెళ్లి చూడగా డెంటిస్ట్‌ హుస్సేన్‌ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. డాక్టర్‌ను రక్షించి కారును, అందులో ఉన్న ఓ రివాల్వర్, ఒక కత్తి, మత్తు మందు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన కిడ్నాపర్లను కూడా పట్టుకునేందుకు పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

డీజీపీ అభినందన
అనంతపురం జిల్లా పోలీసులను ఏపీ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. యంత్రాంగం సకాలంలో స్పందించి డెంటిస్ట్‌ కిడ్నాప్‌ను భగ్నం చేసి, కిడ్నాపర్ల ముఠాను పట్టుకోగలిగిందని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు